పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయించి నివేదిక ఇచ్చేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ అనుబంధ పిటిషన్
లోతుగా విచారణ జరుపుతామన్న న్యాయస్థానం
విచారణ 16కి వాయిదా
సాక్షి, అమరావతి: తన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి జత్వానీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె నుంచి స్వాదీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపి పూర్తి స్థాయిలో విశ్లేíÙంచి, సీల్డ్ కవర్‌లో నివేదిక ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో మంగళవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది.
ఇప్పుడు అంత సమయం లేనందున విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అప్పటివరకు జత్వానీ ఫోన్లు, ఉపకరణాల్లో డేటా భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులిచ్చారు. విద్యాసాగర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జత్వానీ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకిచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారని తెలిపారు.
వాటిలో చాలా కీలక సమాచారం ఉన్నందున ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపి పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయించి, ఆ నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి ఈ అనుబంధ పిటిషన్‌ను వ్యతిరేకించారు. వాటిలోని డేటాను భద్రపరచాలని హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిందన్నారు. అనుబంధ పిటిషన్ ద్వారా ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారని తెలిపారు.
రిమాండ్‌పై పిటిషన్ విచారణ కూడా 16కి వాయిదా
జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తదుపరి విచారణను జస్టిస్ జ్యోతిర్మయి ఈ నెల 16కి వాయిదా వేశారు. విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని కోర్టును పట్టుపట్టవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను 16 వరకు పొడిగించారు.
కాంతిరాణా, గున్నీ పిటిషన్లపై విచారణ వాయిదా
సినీ నటి కాదంబరీ జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పోలీసు అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 3కి వాయిదా పడింది.
ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లుకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఆయనపై ఈ నెల 3వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment