కొలంబస్‌లో తిరుపతి..
న్యూయార్క్: అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన కొలంబస్ నగరంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నారు. ఇందులో గ్రానైట్ రాయితో చేసిన స్వామివారి 8 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ఇది అమెరికాలో రెండో బాలాజీ టెంపుల్ కానుంది. మొదటి దేవాలయాన్ని 1994లో ‘భారతీయ హిందూ టెంపుల్’ పేరుతో నిర్మించారు. ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెంపుల్’ పేరుతో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
ఈ ఆలయంలో కనీసం 1000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తామని దేవాలయ కమిటీ అధికార ప్రతినిధి గణేష్ వత్యమ్ తెలిపారు. గుడి గోపురాన్ని ఇత్తడి లేదా రాగి లోహాలతో తయారు చేయిస్తామని అన్నారు. దీని కోసం శిల్పులను భారత్ నుంచే రప్పిస్తున్నామని చెప్పారు. ఈ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు.