ట్రక్కుబాంబు బీభత్సం
ఇరాక్‌లో 67 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని హెచ్చరించారు. ముస్లిం జాతి కోసం షియాలపై మరిన్ని బాంబు దాడులు చేస్తామన్నారు.
షియా ముస్లిం తెగ ప్రాబల్యం అధికంగా ఉండే ఈ మార్కెట్‌కు ప్రతి గురువారం ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలుదారులు వస్తుంటారు. ఉదయం కూరగాయలు, పండ్లు, ఇతర సరుకులు రవాణా చేసే పలు ట్రక్కులు మార్కెట్ ప్రాంగణంలోకి వస్తుండగా వాటిల్లో ఒక ట్రక్కు దూసుకువచ్చి ఒక్కసారిగా పేలింది. 67 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మార్కెట్‌లోని పలు కార్లు గాలిలోకి ఎగిరిపడ్డాయి. దుకాణాలు బూడిదయ్యాయి.