
గ్లాసెస్ లేకుండానే డేర్ చేసిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాలో కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డేర్ చేశారు. కళ్లజోడు లేకుండానే ఆయన సూర్యగ్రహణాన్నీ వీక్షించారు. కాగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని, అలాచూస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటారు. అయితే ఆ సలహాను ట్రంప్ ఏమాత్రం పాటించలేదు.
శ్వేత సౌధం బాల్కానీ నుంచి ట్రంప్, భార్య మెలానియా సోలార్ ఎక్లిప్స్‌ను తిలకించారు. ఈ సమయంలో ట్రంప్ చిత్రవిచిత్రంగా తన కళ్లు మూస్తూ తెరుస్తూ గ్రహణాన్ని వీక్షించారు. ఇది మీడియా కంటపడింది. రిపోర్టర్లు నేరుగా చూడొద్దని వారించడంతో... అనంతరం కళ్లజోడు ధరించి సూర్యగ్రహణం చూశారు. కాగా భార్య మెలానియాతో పాటు కుమారుడు బారన్ ట్రంప్ కూడా గ్రహణాన్ని వీక్షించారు. అయితే ట్రంప్ కళ్లజోడు లేకుండా సూర్యగ్రహణాన్ని వీక్షించడంపై ట్విట్టర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సూర్యగ్రహణం అమెరికాలో పశ్చిమ తీరంలో ఒరెగాన్‌లోని లింకన్ బీచ్‌లో మొదలైన ఈ అద్భుతం 14 రాష్ట్రాల గుండా సాగింది. గ్రహణంతో అమెరికాలో 14 రాష్ట్రాల మీదుగా 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. ఒరెగాన్ రాష్ట్రంలో మొదలై తూర్పు తీరమైన దక్షిణ కరోలినా రాష్ట్రంలో ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం 90 నిమిషాలు కొనసాగింది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు.