'ట్రంప్ కు చాలా విషయాలు తెలియవు'
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షపదవికి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ కు అన్ని విషయాలు తెలియవని అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియాలతో అణు ఒప్పందాల విషయంలో అమెరికా తీరుపై ట్రంప్ కు అంతగా విషయ పరిజ్ఞానం లేదని, విదేశీ వ్యవహారాలపై మరింత అవగాహనా అతనికి అవసరమని ఒబామా అభిప్రాయపడ్డారు. విదేశీ వ్యవహారాలు, అణు ఒప్పందాలు రెండు వేరు వేరు విషయాలని.. ఒక్కో దేశంతో ఓ రకమైన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అణు భద్రత సదస్సులో రెండో రోజైన శుక్రవారం ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.
జపాన్, దక్షిణ కొరియాల తీరుతో అమెరికాకు నష్టమేంలేదని ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో వాటి ప్రాబల్యం గురించి కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన లేని వ్యక్తులు తమ కార్యాలయంలో ఉండాలని ఏ పౌరుడు భావించారని పునరుద్ఘాటించారు. అణు సంబంధ అంశాలు ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయని, జపాన్, దక్షిణ కొరియా దేశాలు సొంతంగా ఈ రంగంలో అభివృద్ధి చెందుతాయని ఒబామా అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు అణు సంబంధ రంగంలో సక్సెస్ సాధిస్తే అది అమెరికాకు లాభం చేకూర్చడానికి దోహదం చేస్తాయని సదస్సులో వివరించారు.