ఎన్నికలంటే రియాల్టీ షో అనుకున్నావా..?
ట్రంప్‌పై మండిపడ్డ ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడటమంటే రియాల్టీ షోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని డోనాల్డ్ ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశ్నించారు. శనివారమిక్కడ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి చేరువలో ఉన్న ట్రంప్‌పై మండిపడ్డారు. టీవీ నేపథ్యంలో నుంచి వచ్చిన వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించిన ఒబామా..అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడటమంటే వినోదం కాదన్నారు. ‘ఇది రియాల్టీ షో కాదు ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష పదవికి జరిగే పోటీ అని గుర్తుంచుకోవాలి’ అని హితవు పలికారు.
అమెరికాలోని సమస్యలపై ట్రంప్ అనేక సమయాల్లో పలురకాలుగా స్పందించారన్నారు. అమెరికాలో ముస్లింలు, అక్రమ వలసదారులను అనుమతించనంటూ, మెక్సికో వలసదారులు ప్రవేశించకుండా గోడ కడతానని ట్రంప్ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒబామా మాట్లాడుతూ విదేశాంగ విధానంలో కూడా ట్రంప్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా, వాస్తవిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తమ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, అమెరికాలో రానున్న కొత్త ప్రభుత్వానికి అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు వీలుగా పన్నెండు మంది సభ్యులతో కూడిన ‘వైట్‌హౌస్ ట్రాన్సిషన్ కమిటీ’ని ఒబామా ఏర్పాటు చేశారు.