అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (పాత ఫొటో)
వాషింగ్టన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను వరించనుందా?. ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో ట్రంప్ దౌత్యానికి ఆయన్ను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి బుధవారం నామినేట్ చేశారు.
శాంతి బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ కావడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ తెరపైకి లేచింది. గత శనివారం మిచిగాన్‌లో ఓ ర్యాలీకి హాజరైన ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన అభిమానులు నోబెల్..!! నోబెల్..!! అంటూ నినాదాలు చేశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్(నవ్వుతూ) ‘ నా కర్తవ్యం నేను నిర్వహించాను’ అన్నారు.
నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ట్రంప్ సమర్థించారు. ఉత్తరకొరియాతో నేను శాంతినే కోరుకున్నానని అన్నారు. కాగా, అణ్వాయుధాగారాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శాంతి గ్రామం పాన్ మున్ జోమ్‌లో దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌తో చరిత్రాత్మక చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకూ అమెరికా అధ్యక్షులుగా పని చేసిన నలుగురికి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి. వీరిలో థియోడర్ రూజ్‌వెల్ట్, ఉడ్రో విల్సన్, జిమ్మి కార్టర్, బరాక్ ఒబామాలను శాంతికాముకులుగా గుర్తించి అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment