
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనిశ్చితికి తెరదించేందుకు అన్ని వివరాలను వెల్లడిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ‘హత్యకు సంబంధించిన ప్రతి వివరాన్ని పూర్తిగా వెల్లడిస్తాం. కేసుకు సంబంధించి బతికున్న వ్యక్తుల వివరాలను మాత్రం తెలపబోం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు. సీఐఏ, ఇతర ఏజెన్సీలతో మాట్లాడిన తర్వాత మిగిలిన వివరాలూ వెల్లడించాలని నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు.
‘మిలటరీ, భద్రత, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, చట్టబద్ధ సంస్థల గౌరవాన్ని కాపాడటంతోపాటు, విదేశీ సంబంధాలకు విఘాతం కలగకుండా తాత్కాలికంగా పలు పత్రాల విడుదలను నిలిపివేయాల్సి వచ్చింది. 180 రోజుల సమీక్ష తర్వాత వాటినీ విడుదల చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు. ఈ విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నామని అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ పేర్కొన్నారు. ‘కేసుకు సంబంధించి మా దగ్గరున్న అన్ని వివరాలనూ వెల్లడిచేస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.
మీడియా మీతో ఎలా వ్యవహరిస్తుంది?
హాలోవీన్ పార్టీ సందర్భంగా వైట్‌హౌస్ రిపోర్టర్ల పిల్లలతో ట్రంప్ సరదాగా సంభాషించారు. చిన్నారులకు కానుకలు అందించిన ట్రంప్.. మీడియాపై తనదైన శైలిలో జోకులు వేశారు. పిల్లలతో వారి తల్లిదండ్రుల ఉద్యోగం గురించి సరదాగా మాట్లాడారు. వారందరితో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్ మీడియాపై తరచూ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ‘మీరు మీ తల్లిదండ్రుల్లాగే ఉండాలనుకుంటున్నారా? జవాబు చెప్పొద్దు. చెబితే నాకు సమస్యలొస్తాయి. ప్రెస్ మీతో ఎలా వ్యవహరిస్తుంది? ప్రపంచంలో అందరికన్నా మిమ్మల్నే మీడియా జాగ్రత్తగా చూసుకుంటుందని అనుకుంటున్నా’ అని ట్రంప్ సరదాగా అన్నారు. పిల్లలతో ఉల్లాసంగా గడిపిన ట్రంప్ వారికి చాక్లెట్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment