న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియాపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఓ కొత్త పేరును తగిలించారు. కిమ్ జాంగ్‌కు 'పొట్టి రాకెట్ మనిషి' (లిటిల్ రాకెట్ మ్యాన్) అంటూ పేరు పెట్టారు. తమ విదేశాంగ కార్యదర్శి అనవసరం తన శక్తిని వృధా చేసుకుంటున్నారని, అసలు ఉత్తర కొరియాతో చర్చలు ముమ్మాటికి అనవసరం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పలు ట్వీట్ల వర్షం కురిపించారు. ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్ సన్ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే, దీనిపై స్పందించిన ట్రంప్.. 'మిస్టర్ టిల్లర్ సన్.. మీ శక్తిని సంరక్షించుకోండి. పొట్టి రాకెట్ మనిషి(కిమ్ జాంగ్ ఉన్)కి మనం ఏం చేయాలో అదే చేద్దాం. ఆ దేశంతో చర్చలు అనవసరం.. మా రెక్స్ టిల్లర్‌సన్ మా అద్భుతమైన విదేశాంగ కార్యదర్శి అనవసరం ఆయన శక్తిని వృధా చేసుకుంటున్నారు. ఆ పొట్టి రాకెట్ మనిషితో చర్చలు అనే మాట టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు.. అయినా 25 ఏళ్ల తర్వాతనే నేను ఆ పొట్టి రాకెట్ మనిషితో ఎందుకు పోరాడాల్సి వస్తుంది ఎందుకంటే.. క్లింటన్ ఫెయిలయ్యారు.. బుష్ ఫెయిలయ్యారు.. ఆఖరికి ఒబామా కూడా ఫెయిలయ్యారు.. కానీ నేను మాత్రం ఫెయిలవ్వను' అంటూ వరుసగా ట్రంప్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
క్లింటన్, బుష్, ఒబామా ఫెయిల్.. నేను మాత్రం అవ్వను
Published Mon, Oct 2 2017 5:26 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
Advertisement