
ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం ఖరారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఇందుకోసం 13 నెలలుగా పార్టీలోని మహామహులతో పోటీ పడి ట్రంప్ విజయం సాధించారు.
మహామహులను ఓడించిన వైనం
- ‘మరింత కష్టపడతా.. అమెరికా ఫస్ట్’ అని వ్యాఖ్య
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఇందుకోసం 13 నెలలుగా పార్టీలోని మహామహులతో పోటీ పడి ట్రంప్ విజయం సాధించారు. ఒహయొలోని రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో నామినేటింగ్ ఓట్ల ప్రక్రియలో తన కుమారుడు డొనాల్డ్ జే ట్రంప్ వేసిన ఓటుతో ఆయన పార్టీ అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన 1,237 ఓట్లు (మొత్తం రిపబ్లికన్ ప్రతినిధుల ఓట్లలో సగం) సాధించారు. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ అధికారికంగా ధ్రువీకరించారు.
ఏడాది క్రితం పార్టీలో చేరిన ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ నినాదంతో బరిలో ఉన్న జాన్ కసిచ్, జెబ్ బుష్ లాంటి ప్రముఖులను ప్రైమరీల్లో ఓడించారు. ‘విజయం సాధించాం. మరింత కష్టపడి పనిచేస్తా. మిమ్మల్ని (రిపబ్లికన్లను) ఓడిపోనివ్వను. అమెరికా ఫస్ట్’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదే ఊపుతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచి సరైన నాయకత్వంతో దేశంలో మార్పు తీసుకువస్తానన్నారు. కాగా, షికాగోకు చెందిన శాలభ్ శాలీ కుమార్ అనే భారత సంతతి వ్యక్తి, ఆయన భార్యతో రూ.6.03 కోట్లు ట్రంప్‌కు ఎన్నికల విరాళంగా అందజేశారు. గతేడాది రిపబ్లికన్ హిందూ సంఘాన్ని ఈయన ప్రారంభించారు. పాకిస్తాన్‌పై స్పష్టతతో ఉన్న ట్రంప్‌కు మద్దతివ్వటంలో తప్పులేదని శాలీ తెలిపారు. నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్‌తో ట్రంప్ పోటీపడనున్నారు. కాగా, శ్వేతసౌధంలో కూర్చునేందుకు ట్రంప్‌కు అవకాశం ఇవ్వొద్దని హిల్లరీ అమెరికన్లను కోరారు. ట్రంప్‌కు డిప్యూటీగా (ఉపాధ్యక్ష పోటీదారుగా) ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్ నామినేట్ అయ్యారు.
చివరి నిమిషం వరకు అడ్డంకులే!
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నిక అభ్యర్థిత్వానికి అవసరమైన మెజారిటీ సాధించినా.. రిపబ్లికన్ పార్టీలోని నేతలు మాత్రం దీనికి అంగీకరించలేదు. చివరి నిమిషం వరకు ట్రంప్‌కు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. ట్రంప్‌కు వచ్చిన ఓట్లను వెనక్కు తీసుకునేలా పార్టీ నిబంధలను సవరించే ప్రయత్నమూ జరిగింది.