అమెరికా పీఠం ఎవరిది? | US Presidential Election is tomorrow | Sakshi
Sakshi News home page

అమెరికా పీఠం ఎవరిది?

Published Mon, Nov 7 2016 12:59 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

అమెరికా పీఠం ఎవరిది? - Sakshi

అమెరికా పీఠం ఎవరిది?

రేపే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు
- హిల్లరీ, ట్రంప్ భవితవ్యం తేల్చనున్న 15 కోట్లకు పైగా ఓటర్లు
- గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు తప్పనిసరి
- కాలిఫోర్నియాలో 55, మరో 8 రాష్ట్రాల్లో మూడేసి ఎలక్టోరల్ ఓట్లు
- ఒహయోలో గెలిచిన వారిదే అధ్యక్ష పీఠం!
- భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రారంభం
- 9వ తేదీ మధ్యాహ్నంకల్లా పూర్తి ఫలితం

 
 సాక్షి, నేషనల్ డెస్క్: రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు... మొత్తం 12 కోట్ల మంది అమెరికన్లు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ల భవితవ్యం తేల్చనున్నారు. ఇప్పటికే దాదాపు 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా ఉండడంతో చివరి నిమిషం వరకూ ఫలితాన్ని నిర్ణయించే రాష్ట్రాల్లో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వారం క్రితం వరకూ పోరు హోరాహోరీ అంటూ సర్వేలు ప్రకటించగా... తాజాగా హిల్లరీ ఆధిక్యంలోకి వచ్చారు. అక్టోబర్ మధ్య వరకూ హిల్లరీ రెండంకెల పాయింట్ల ఆధిక్యంలో దూసుకుపోయారు. ఎఫ్‌బీఐ ఈమెయిల్ వివాదంతో ఆధిక్యం కాస్తా ఒకటి, రెండు పాయింట్లకు పడిపోయింది. అంతవరకూ ట్రంప్ ఓటమి తప్పనిసరన్న సర్వేలు ఈ ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తాయంటూ ప్రకటించాయి.

 ఎక్కువ ఓట్లు పడ్డ పార్టీకే మొత్తం సీట్లు
 అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే అభ్యర్థి తప్పకుండా 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించాలి. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 4 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియాకు 55, టెక్సాస్ 38, న్యూయార్క్, ఫ్లోరిడాలకు 29 చొప్పున ఓట్లు ఉండగా... 10 లక్షలు ఆ లోపు జనాభా ఉన్న మోంటానా, అలాస్కా, డెలావేర్, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాలకు 3 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ సభ్యులు(435 మంది), సెనేట్ ప్రతినిధుల(100) సంఖ్య మొత్తం 535.. వాటి ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు నిర్ణయించారు. డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా నుంచి ముగ్గురు ఎలక్టోరల్స్ కలవడంతో మొత్తం  ఓట్లు 538 అవుతాయి. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ పాపులర్ ఓటు(ఎక్కువ ఓట్లు) సాధిస్తే మొత్తం ఎలక్టోరల్ సీట్లు ఆ పార్టీకి సొంతమవుతాయి.

 తేడా 3 గంటలు..  అమెరికాలో 9 టైమ్ జోన్లు(కాలమానాలు) ఉన్నాయి. అట్లాంటిక్ సముద్రతీరం ప్రాంత రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, న్యూహ్యాంప్‌షైర్, జార్జియా, నార్త్, సౌత్ కరోలినా, మసాచుసెట్స్, మిచిగన్, న్యూజెర్సీ, న్యూయార్క్ తదితర రాష్ట్రాలు ఈస్ట్రన్ టైమ్ జోన్‌లో ఉంటే... ఇలినాయ్, ఫ్లోరిడా, కెంటకీ, టెక్సాస్ వంటి రాష్ట్రాలు సెంట్రల్ టైమ్ జోన్‌లో ఉన్నాయి. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా, నెవెడాలు పసిఫిక్ టైం జోన్‌లో, అరిజోనా, కొలరాడో, నెబ్రాస్కా, కాన్సాస్‌లు మౌంటెన్ టైమ్ జోన్‌లో ఉన్నాయి. అలాస్కా, హవాయ్‌లకు వేర్వేరు టైమ్ జోన్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో టైమ్ జోన్‌కు మధ్య గంట తేడా ఉంటుంది. న్యూయార్క్‌లో ఉదయం 10 గంటలైతే లాస్‌ఏంజెలిస్‌లో ఉదయం 7 గంటలు. న వంబర్ 8 న ఈస్ట్రన్ టైమ్ జోన్‌లో ఉదయం 6 గంటలకు(భారత కాలమానం సాయంత్రం 5 గంటలు) ఎన్నికలు ప్రారంభమవుతాయి. 

సెంట్రల్ టైమ్ జోన్ రాష్ట్రాల్లో(రాత్రి 6 గంటలు), మౌంటెన్ టైమ్ జోన్‌లో(రాత్రి 7 గంటలకు), పసిఫిక్ టైమ్ జోన్‌లో(రాత్రి 8 గంటలకు) ఎన్నికలు మొదలవుతాయి. కెంటకీ, ఇండియానాల్లో ఎన్నికలు ముందుగా ముగుస్తాయి.  అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినా మంచు ప్రాంతం అలాస్కాలో పోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది. తొలి ఫలితం న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నోచ్‌లో నవంబర్ 8  ఉదయం 10.30కే (భారత కాలమానం రాత్రి 9 గంటలు) వెల్లడవుతుంది. అక్కడ 12 మంది ఓటర్లే ఉన్నారు.9న ఉదయం 6 గంటల(భారత కాలమానం) నుంచి ఎగ్జిట్ పోల్స్‌తో పాటు కౌంటింగ్ ప్రాంరభమవుతుంది. 10 గంటలకు ఫలితంపై ఒక అంచనా వస్తుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడి అవుతాయి.

 ఫ్లోరిడా, ఒహయో, పెన్సిల్వేనియా, న్యూ హ్యాంప్‌షైర్, మిన్నెసొటా, అయోవా, మిచిగన్, కొలరాడో, నార్త్ కరోలినా, నెవడా, విస్కాన్సన్‌లు ఫలితాన్ని తారుమారు చేసే(స్వింగ్) రాష్ట్రాలుగా భావిస్తున్నారు. ఒహయో రాష్ట్రంలో గెలవకుండా ఇంతవరకూ ఏ రిపబ్లికన్ అభ్యర్థి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. డెమోక్రాట్ల నుంచి జాన్ ఎఫ్ కెనడీ ఒకరే దీనికి మినహాయింపు. అందుకే  అభ్యర్థులు దీనిపై ఎక్కువ దృష్టిపెడతారు.
 
 ఎలక్టోరల్స్ అంటే...
 పార్టీలు ముందుగానే ప్రతి రాష్ట్రంలో ఎలక్టోరల్ సంఖ్య ప్రకారం ప్రతినిధుల్ని నియమిస్తాయి. ఓటర్లు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలో దేనికి ఓటు వేసినా ఓట్లు ఎలక్టోరల్ సభ్యుల ఎంపికకు వేసినట్టే. తాము సూచించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఎలక్టోరల్స్‌కు ఓటర్లు సూచిస్తున్నట్లు భావించాలి. ఉదాహరణకు కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీ పాపులర్ ఓటు(అత్యధిక ఓట్లు) సాధిస్తే అక్కడి మొత్తం 55 ఎలక్టోరల్స్ (డెమోక్రటిక్ ప్రతినిధులు) తుది అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా హిల్లరీకే ఓటేయాలి.  డిసెంబర్ రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం రోజున అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎలక్టోరల్స్ ఎన్నుకుంటారు. విజేతను జనవరి 2, 2017న ప్రకటిస్తారు. జనవరి 20న అధికారికంగా ఎన్నికైన అభ్యర్థి దేశాధ్యక్ష బాధ్యతలు చేపడతారు.  అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 8నే పూర్తయినా... జనవరి 6, 2017న ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ఫలితం అధికారికంగా ప్రకటించాక ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది.
 
 ట్రంప్ సభలో కలకలం
 గన్ అరుపుతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు
 వేదికపై నుంచి ట్రంప్ తరలింపు

 
 రెనో: నెవడా రాష్ట్రం రెనోలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో  కలకలం రేగింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఒక్కసారిగా ట్రంప్‌ను వేదిక నుంచి తీసుకుపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు కంగారుపడ్డారు. సభలో పాల్గొన్న ఒక వ్యక్తి గన్ అని అరవడంతో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు  అప్రమత్తమై ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పూర్తిగా తనిఖీలు చేశాక ఎలాంటి గన్ లేదని నిర్ధారించారు. అనంతరం సభ యథావిధిగా కొనసాగింది. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టారు. ఎన్నికలకు మరో రోజే సమయం ఉందనగా అమెరికా ప్రతినిధుల  సభ స్పీకర్ పాల్ ర్యాన్.. ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. మరోవైపు భారతీయ అమెరికన్ల ఓట్లు పొందేందుకు ట్రంప్ కుమారుడు ఎరిక్.. ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండోలోని హిందూ దేవాలయం సందర్శించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 హిల్లరీకి 4 శాతం ఆధిక్యం
 అధ్యక్ష ఎన్నికలకు మరొక్క రోజే సమయముందనగా నిర్వహించిన తాజా సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి  డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నాలుగు శాతం ఆధిక్యంలో ఉన్నారు. వాల్‌స్ట్రీట్‌జర్నల్ / ఎన్‌బీసీ న్యూస్ పోల్ ప్రకారం 44 శాతం మంది హిల్లరీని సమర్థించగా, 40 మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. మరో 6 శాతం లిబర్టేరియన్ అభ్యర్థి గ్యారీ జాన్సన్ వైపు మొగ్గు చూపారు.
 
 ఎన్నికల రోజు అమెరికా ఓటర్లను చంపేస్తాం: ఐసిస్
 వాషింగ్టన్: ఈ నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే అమెరికన్ ఓటర్లను చంపేస్తామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ముస్లింలు ఈ ఎన్నికల్లో పాల్గొనరాదని ఐసిస్ సూచించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఎస్‌ఐటీఈ నిఘా బృందం డెరైక్టర్ రీటా కట్జ్ ట్విటర్‌లో తెలిపారు. ఐసిస్‌కు చెందిన అల్ హయత్ మీడియా సెంటర్ ఒక లేఖలో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు రీటా తెలిపారు. ఈ వ్యాసంలో ఓటర్లను ఉగ్రవాదులు చంపేస్తారని, బ్యాలట్ బాక్సులను ధ్వంసం చేస్తారని ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఐసిస్ ఈ వ్యాసంలో మతానికి సంబంధించి సుదీర్ఘ వివరణలు ఇస్తూ దాడులను సమర్థించుకుంది. ఇస్లాం, ముస్లింల పట్ల వ్యవహరించే తీరులో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య పెద్ద తేడాలు లేవని తెలిపింది. న్యూయార్క్, వర్జీనియా, టెక్సాస్‌లలో దాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement