అగ్ర పీఠం పోరు హోరాహోరీ | A big fight between Hillary and Trump | Sakshi
Sakshi News home page

అగ్ర పీఠం పోరు హోరాహోరీ

Published Sun, Oct 23 2016 2:51 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

అగ్ర పీఠం పోరు హోరాహోరీ - Sakshi

అగ్ర పీఠం పోరు హోరాహోరీ

- తుది అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నిక
- హిల్లరీ-ట్రంప్‌ల మధ్య ఉత్కంఠ సమరం
- హిల్లరీకే గెలుపు అవకాశాలు ఎక్కువంటున్న సర్వేలు
- నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికల్లో తేలనున్న ఫలితం

 
 అమెరికా అధ్యక్ష పదవి! ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం! దానిని దక్కించుకోవడానికి హేమాహేమీల మధ్య హోరాహోరీ పోరాటం! రెండేళ్ల కిందట మొదలైన ఈ పోరు తుది అంకానికి చేరింది. ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వ్యక్తిగత దూషణల పర్వం పతాక స్థాయికి చేరింది. పరస్పర ఆరోపణలతో విస్ఫోటనాలు జరుగుతున్నాయి. ఎంతో ఉత్కంఠగా, ఉద్రిక్తంగా సాగుతున్న ఈ సమరం మరో 15 రోజుల్లో ముగియనుంది. నవంబర్ 8న అమెరికన్లు తీర్పు ఇవ్వనున్నారు. ఇద్దరు ప్రధాన అభ్యర్థుల్లో విజేత ఎవరనేది ఆ రోజు జరిగే ఎన్నికలు తేల్చనున్నాయి.

అయితే.. అమెరికన్లు ఇప్పటికే చాలా వరకూ నిర్ణయం తీసేసుకున్నారని సర్వేలు చెప్తున్నాయి. కొంత కాలం కిం దటి వరకూ ప్రజాభిప్రాయం ఇరువురు ప్రధాన అభ్యర్థుల మధ్యా పోటాపోటీగా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ వైపు మొగ్గు పెరుగుతోందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడిస్తున్నా యి. ఇందుకు ప్రధాన కారణం.. హిల్లరీ విధానాల కన్నా కూడా.. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపెట్టిన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై విముఖతేననీ చెప్తున్నాయి. అయినప్పటికీ.. దేశంలో ‘స్వింగ్ స్టేట్స్’గా పరిగణించే కొన్ని కీలక రాష్ట్రాలకు ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఉంటుందని వివరిస్తున్నాయి.

యూఎస్‌ఏ టుడే తాజా సర్వే ఫలితాలు.. మొత్తం 538 ఎలొక్టరల్ ఓట్లలో హిల్లరీకి 263 ఓట్లు, ట్రంప్‌కు 180 ఓట్లు వస్తాయని.. మరో 95 ఓట్లు ఎటువైపైనా పడవచ్చని చెప్తున్నాయి. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవడానికి 270 ఓట్లు అవసరం. ఈ సర్వే ఫలితాన్ని బట్టి.. అమెరికా ఓటర్లు తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకోవడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే.. వివాదాల ట్రంప్ మాత్రం.. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందని ముందే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాను గెలిస్తే మాత్రమే ఫలితాలను అంగీకరిస్తానంటూ మరో వివాదానికి తెరతీశారు. ఇటువంటి ఆరోపణల ద్వారా ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్వాపరాలపై ‘సాక్షి’ ఫోకస్..
 
 హిల్లరీ చరిత్ర సృష్టించే దిశగా...
 అమెరికా మాజీ అధ్యక్షుడు (1993-2001) బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ (68). ఆమె 2000 సంవత్సరంలో న్యూయార్క్ నుంచి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ప్రథమ మహిళగా ఉంటూ సెనెటర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అనంతరం 2006 లోనూ రెండోసారి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ కోసం బరాక్ ఒబామాతో పోటీ పడి ఓడిపోయారు. ఆమె 2008 ఎన్నికల తర్వాత ఒబామా సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2013 వరకూ ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నామినేషన్ సంపాదించి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిస్తే.. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు.
 
 జాతి, వయసు ప్రభావం..
 ఈ అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో అమెరికా పౌరుల జాతి, వయసు, లింగభేదం, మతం, దేశీయత తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ నిపుణుల అంచనా. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల ప్రకారం..
అమెరికా నల్లజాతి వారిలో అత్యల్పంగా 3% మంది, హిస్పానిక్(లాటిన్ అమెరికా జాతీయులు) ప్రజల్లో 17% మం ది ట్రంప్‌కు మద్దతిస్తున్నారు. కీలకమైన 4 ‘స్వింగ్ రాష్ట్రా’ల్లోని జనాభాలో హిస్పానిక్ జాతీయులు ఐదో వంతు మంది ఉన్నా రు. శ్వేతజాతీయుల్లో 51% మంది ట్రంప్‌ను బలపరుస్తున్నారు.
పురుషులు, మహిళల వారీగా చూస్తే.. పురుషుల్లో 49% మంది ట్రంప్‌కు, మహిళల్లో 49% మంది హిల్లరీకి మద్దతిస్తున్నారు. హిల్లరీకి మద్దతిచ్చే పురుషుల సంఖ్య 33%గా ఉంటే.. ట్రంప్‌కు మద్దతిచ్చే మహిళల సంఖ్య 34%గా ఉంది.
వయసు వారీగా చూస్తే.. 18 నుంచి 39 ఏళ్ల వయసున్న యువతరంలో హిల్లరీ బలం అధికంగా ఉంది. వారిలో 41% మంది ఆమెకు మద్దతు ఇస్తోంటే, ట్రంప్‌కు మద్దతిస్తున్న ఆ వయసు వారి సంఖ్య 29 శాతమే ఉంది. 40 నుంచి 64 మధ్య వయస్కుల్లో ఇద్దరు అభ్యర్థులకూ కొంచెం తేడాతో ఒకే విధమైన మద్దతు లభిస్తోంది. వీరిలో ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 44 శాతమైతే.. హిల్లరీని సమర్థిస్తున్న వారి సంఖ్య 43 శాతంగా ఉంది. ఇక 65 ఏళ్లు ఆపై వయసుగల పెద్దల్లో మాత్రం ట్రంప్ హవా ఉంది. వారిలో 49 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలిస్తే.. కేవలం 39 శాతం మంది మాత్రమే హిల్లరీకి మద్దతునిస్తున్నారు. నిజానికి యువకులు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా కూడా ఓట్లు వేయడం తక్కువని, పెద్ద వాళ్లు ఠంచనుగా ఓటు వేస్తారని ఓటింగ్ సరళులు చెప్తున్నాయి. అయితే.. ఇటీవలి కాలంలో యువత బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్న తీరు పెరుగుతోందనీ పరిశీలకులు చెప్తున్నారు.
ఇక విద్యాభ్యాసం స్థాయిని బట్టి కూడా ఇరువురు నేతలకు మద్దతిస్తున్న వారి సంఖ్యలో తేడాలున్నాయి. తక్కువ విద్యాభ్యాసం గల వారిలో ట్రంప్‌కు మద్దతు ఎక్కువగా ఉంటే.. విద్యాధికుల్లో హిల్లరీకి ఆదరణ అధికంగా ఉంది. ఉన్నత పాఠశాల అంతకన్నా తక్కువ చదువు గల వారిలో 44% మంది ట్రంప్‌కు, 36% మంది హిల్లరీకి మద్దతిస్తున్నారు. కాలేజీ విద్యను అభ్యసించిన వారిలో ట్రంప్‌కు 46%, హిల్లరీకి 40% మద్దతు ఉంది. గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ట్రంప్‌ను సమర్థిస్తున్న వారి సంఖ్య 37% అయితే, హిల్లరీకి మద్దతిస్తున్న వారి సంఖ్య 46% గా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది హిల్లరీకి మద్దతు ప్రకటిస్తే.. కేవలం 33 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తామని చెప్తున్నారు.
 
 ట్రంప్ దురుసుగా.. దూకుడుగా..
 రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ (70) రియల్ ఎస్టేట్ వ్యాపారి, టెలివిజన్ ప్రొడ్యూసర్. వ్యాఖ్యాత. 1996 నుంచి 2015 వరకూ మిస్ యూనివర్స్, మిస్ యూఎస్‌ఏ, మిస్ టీన్ యూఎస్‌ఏ అందాల పోటీల నిర్వహణ యజమాని కూడా. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్న ట్రంప్.. 2000 సంవత్సరంలోనే రిఫార్మ్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడటానికి నామినేషన్ కోసం ప్రయత్నించారు. అయితే ఓటింగ్ ప్రక్రియ మొదలుకాక ముందే విరమించుకున్నారు. తాజా ఎన్నికల కోసం తాను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు గత ఏడాదే ప్రకటించారు. దురుసుగా, దూకుడుగా దూసుకెళ్తూ నామినేషన్ సాధించి హిల్లరీతో తలపడుతున్నారు. ఆయన గెలిస్తే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కుతారు.
 
 సర్వేల్లో హిల్లరీ ముందంజ
 ఎన్నికల రేసులో ఆరంభంలో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య ప్రజాభిప్రాయం పోటాపోటీగా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ హిల్లరీ వైపు మొగ్గు పెరుగుతూ వస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ముఖాముఖి పోటీలో హిల్లరీ 48% మంది మద్దతు ఉంటే.. ట్రంప్‌కు 41% మద్దతు ఉందని వెల్లడైనట్లు యూఎస్‌ఏ టుడే పత్రిక ప్రకటించింది. అంటే ట్రంప్ కన్నా హిల్లరీ ఏడు శాతం ఆధిక్యంలో ఉన్నారని, రెండు నెలల కిందటికన్నా ఆమె ఆధిక్యం ఇప్పుడు ఒక శాతం పెరిగిందని చెప్పింది. ఇంకా నిర్ణయించుకోని ఓటర్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తోందని కూడా పేర్కొంది. అయితే.. సర్వేలో నాలుగు పక్షాల పోటీలో.. హిల్లరీకి 42%, ట్రంప్‌కి 35%, లిబర్టేరియన్ అభ్యర్థి గారీ జాన్సన్‌కు 9 శాతం ఓట్లు, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్‌కు 4 శాతం ఓట్లు చొప్పున లభించగా.. 10 శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదని జవాబిచ్చినట్లు వెల్లడించింది.

ఈ ఎన్నికల్లో తాము మద్దతిస్తున్న అభ్యర్థి గెలుస్తాడన్న ఆశ కన్నా.. ప్రత్యర్థి అభ్యర్థి గెలుస్తారేమోనన్న ఆందోళన అత్యధిక శాతం మంది ఓటర్లలో కనిపిస్తున్నట్లు యూఎస్‌ఏ టుడే వివరించింది. అంతేకాకుండా.. హిల్లరీకి మద్దతు ఇస్తున్న ప్రతి పది మందిలో ముగ్గురు తాము ట్రంప్‌కు వ్యతిరేకంగా హిల్లరీకి మద్దతు ఇస్తున్నామని, ఆమె కోసం కాదని చెప్పారు. అలాగే.. ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న ప్రతి పది మందిలో నలుగురు తాము హిల్లరీకి వ్యతిరేకంగా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. విచిత్రమేమిటంటే.. సర్వే చేసిన వారిలో సగం మందికి పైగా ఇద్దరు ప్రధాన నేతలనూ విశ్వసించడం లేదు. హిల్లరీ నిజాయితీపరురాలు, విశ్వసించదగ్గ వ్యక్తి అని తాము నమ్మడం లేదని 59 శాతం మంది పేర్కొన్నారు. అందులో హిల్లరీకి మద్దతిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరిది ఇదే మాట. ఇక ట్రంప్‌కు నిజాయితీ లేదని, ఆయనను నమ్మలేమని అనేవారి సంఖ్య 61 శాతంగా ఉంది. ట్రంప్‌కు మద్దతిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరిది ఇదే అభిప్రాయం.
 
 సామాజిక అంశాల చుట్టూ..
అమెరికా అధ్యక్ష పదవిని గత రెండు పర్యాయాలూ డెమొక్రటిక్ పార్టీ(ఒబామా) దక్కించుకుంది. అంతకుముందు రెండు సార్లు రిపబ్లికన్ పార్టీ (బుష్) చేతుల్లో ఆ పదవి ఉంది. తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న సమరం అనేక ఉత్కంఠ మలుపులు తిరుగుతోంది. రెండు వందల ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఎన్నికలుగా ఈ అధ్యక్ష ఎన్నికలు చరిత్రకెక్కుతున్నాయి. ముఖ్యంగా గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో.. అప్పటికే మందగించిన దేశ ఆర్థిక పరిస్థితులు, వాటిని చక్కదిద్దడం అనేవి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడూ దాదాపు అదే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో సామాజిక అంశాలు కీలక స్థానంలోకి వచ్చి చేరాయి. ముఖ్యంగా జాతి వివక్ష, లింగ వివక్ష, లైంగిక దాడి, వలసలు, ముస్లిం భయం, యూదు వ్యతిరేకత, ధనికస్వామ్యం, అధికారస్వామ్యం వంటి అంశాల చుట్టూనే ప్రధాన ప్రత్యర్థుల చర్చ, ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన అభ్యర్థులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, వెలుగుచూస్తున్న అంశాలు అమెరికన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజలు తమ తమ అభిప్రాయాల మేరకు చెరోవైపుగా చీలుతున్నారు.
 
 ఆరోపణలు, విమర్శలు..
 అందులో.. మహిళలపట్ల ట్రంప్ వ్యవహార శైలి, చేస్తున్న దూషణపూర్వక వ్యాఖ్యలు, గతంలో వచ్చిన, ఇప్పుడూ వస్తున్న లైంగిక దాడుల ఆరోపణలు, అమెరికా నుంచి వలసదారులను పంపించివేయాలంటూ చేసిన వ్యాఖ్యలు, ఉగ్రవాదానికి - ముస్లింలకు ముడిపెడుతూ చేసిన విమర్శలు మరింతగా ప్రభావం చూపుతున్నాయి. ఈ ఆరోపణల ముందు హిల్లరీ అవినీతిపరురాలని, డబ్బు తీసుకోనిదే ఏ పనీ చేయరని, 30 ఏళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నా ఏమాత్రం సామర్థ్యం లేదని, విదేశాంగ మంత్రిగా అధికారిక ఈ-మెయిళ్లను ప్రైవేటు సర్వర్ ద్వారా పంపించారని ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న విమర్శలు తేలిపోతున్నాయి. దీంతో పార్టీ ప్రైమరీల సమయంలో తనకు లభించిన మద్దతును ఆయన క్రమంగా కోల్పోతున్నారు. పలువురు మహిళలు తమపై ట్రంప్ గతంలో లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తే.. అవి నిరాధారమని కొట్టివేసిన ట్రంప్.. తాను కూడా హిల్లరీ క్లింటన్ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై లైంగిక ఆరోపణలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేశారు.
 
 చర్చల్లో హిల్లరీ పైచేయి..
ఇటీవల బయటపడిన పదేళ్ల కిందటి తన వీడియో క్లిప్ వ్యాఖ్యలతో ట్రంప్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మహిళలను అత్యంత అసభ్యంగా చిత్రిస్తూ మాట్లాడటమే కాక.. ఒక మహిళపై తాను లైంగిక దాడికి పాల్పడ్డ సూచనలు కూడా ఈ వీడియోలోని ట్రంప్ వ్యాఖ్యల్లో వినిపించడం పెను దుమారం రేపింది. సొంత పార్టీ నాయకులు కొందరు ఆయనను బరిలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. చివరికి తనే ఎంపిక చేసుకున్న ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన దుస్థితి. అయినా తాను ‘పోరాటం విరమించన’ంటూ ట్రంప్ భీష్మించారు.

ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూనే, తాను ఇప్పుడు మారానని, అయినా గతంలో బిల్ క్లింటన్ ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు తనతో చేశారని ఎదురు దాడికి దిగారు. అలాగే.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన మూడు ముఖాముఖి చర్చల్లోనూ ట్రంప్‌పై హిల్లరీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ వ్యక్తిత్వ లోటుపాట్లతో పాటు విధానాల విషయంలోనూ ఆయన అనుభవరాహిత్యాన్ని ఎండగట్టారు. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్తూ ఈ-మెయిల్స్ విషయంలో పొరపాటు చేశానని అంగీకరించారు. హిల్లరీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతిలో కీలుబొమ్మ అని, రష్యా ద్వారా అమెరికాలో హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ట్రంప్ తాను చెల్లించిన పన్ను వివరాలను బయటపెట్టాలని హిల్లరీ డిమాండ్ చేస్తే.. హిల్లరీ ప్రైవేటు సర్వర్ నుంచి డిలిట్ చేసిన వేలాది ఈ-మెయిళ్లను బయటపెట్టాలని ట్రంప్ ఎదురుదాడి చేశారు.

 న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజెలెస్ టైమ్స్, హూస్టన్ క్రానికల్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు, వార్తా పత్రికలు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు ప్రకటించాయి. 1940 నుంచీ డెమొక్రటిక్ పార్టీకి మద్దతివ్వని డాలస్ మార్నింగ్ న్యూస్ కూడా ఈసారి హిల్లరీకి మద్దతునిచ్చింది. 1857వ సంవత్సరం నుంచీ ప్రచురితమవుతూ.. గతంలో అబ్రహాం లింకన్, లిండన్ జాన్సన్‌లకు మాత్రమే మద్దతిచ్చిన ద అట్లాంటిక్ వార్తాపత్రిక.. ఇంత కాలానికి మళ్లీ హిల్లరీకి మద్దతు ప్రకటించింది. 34 ఏళ్ల కిందట స్థాపితమై, ఇప్పటివరకూ ఏ అభ్యర్థికీ మద్దతివ్వని యూఎస్‌ఏ టుడే పత్రిక ఇప్పుడు.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ‘అధ్యక్ష పదవికి అనర్హుడు’ అంటూ తన వ్యతిరేకతను ప్రకటించింది.

 ప్రత్యర్థులను ఓడించి...
 అమెరికా 58వ అధ్యక్ష పదవి నామినేషన్ కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి ఆరుగురు, రిపబ్లికన్ పార్టీ నుంచి ఏకంగా 17 మంది బరిలోకి దిగారు. ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థిని ఎంచుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి - జూన్ నెలల మధ్య ప్రైమరీలు, కాకస్‌లు నిర్వహించాయి. రెండు పార్టీల సభ్యులు లేదా మద్దతుదారులు వార్డుల వారీగా సమావేశమై.. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తాము ఎవరికి, ఎందుకు మద్దతివ్వాలని అనుకుంటున్నామో చర్చించి.. ఓటింగ్ నిర్వహించటాన్ని ప్రైమరీ లేదా కాకస్ అని వ్యవహరిస్తారు. ప్రైమరీలో రహస్య ఓటింగ్ ఉంటుంది. కాకస్‌లో చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు.

మిగతా ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. ఆ ఓటింగ్‌లో తమ తరఫున అభ్యర్థులను ఎన్నుకునేందుకు డెలిగేట్లను (ప్రతినిధులను) ఎన్నకుని పార్టీ జాతీయ ప్రైమరీలకు పంపిస్తారు. జాతీయ ప్రైమరీల్లో ఈ డెలిగేట్ల ఓట్లు ఎక్కువ సంపాదించిన అభ్యర్థికి పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు నామినేషన్ లభిస్తుంది. డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్.. ప్రధాన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌తో పాటు మార్టిన్ ఓ మాలీ, లారెన్స్ లెస్సిగ్, లింకన్ చాఫీ, జిమ్ వెబ్‌లను ఓడించి జూలై 26న జరిగిన పార్టీ జాతీయ ప్రైమరీలో నామినేషన్ సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్.. ప్రైమరీలు, కాకస్‌లలో ప్రత్యర్థులు టెడ్ క్రూజ్, జాన్ కాసిచ్, మార్కో రూబియో, జెబ్ బుష్‌లతో పాటు ఇతర అభ్యర్థులను ఓడించి జూలై 19న జరిగిన పార్టీ జాతీయ ప్రైమరీలో నామినేషన్ దక్కించుకున్నారు. అధ్యక్ష అభ్యర్థులే తమతో కలిసి పోటీ చేసే ఉపాధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసుకునే సంప్రదాయం ప్రకారం.. హిల్లరీ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ కెయిన్‌ను, ట్రంప్ తన సహచరుడిగా మైక్ పెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థుల మధ్య అధ్యక్ష ఎన్నికల సమరం మొదలయింది.

 మూడో పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు
 లిబర్టేరియన్ పార్టీ నుంచి న్యూ మెక్సికో మాజీ గవర్నర్ గారీ జాన్సన్, గ్రీన్ పార్టీ నుంచి మసాచుసెట్స్‌కు చెందిన వైద్యుడు జిల్ స్టీన్, కాన్‌స్టిట్యూషన్ పార్టీ నుంచి డారెల్ కాసిల్, స్వతంత్ర అభ్యర్థులుగా ఎవాన్ మెక్‌ములిన్, వ్యాపారవేత్త రాకీ డి లా ఫూంటే, ఎకానమిక్స్ ప్రొఫెసర్ లారెన్స్ కోట్లికాఫ్ తదితరులు మూడో పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో గల ‘బ్యాలెట్ యాక్సెస్’ చట్టాల ప్రకారం వీరు పోటీకి దిగుతున్నారు.
 
 ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ
 అమెరికా అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. పౌరులు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు కానీ వారు ఎన్నుకునేది అధ్యక్షుడిని కాదు. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీకి తమ రాష్ట్రం నుంచి ప్రతినిధులను ఆయా రాష్ట్రాల్లోని సామాన్య ఓటర్లు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను ఎలక్టర్లు అంటారు. నిజానికి ఈ ఎలక్టర్లు ముందుగానే ఏదో ఒక పార్టీ అధ్యక్ష అభ్యర్థికి మద్దతుగా ఉంటారు. తాము కోరుకునే అధ్యక్ష అభ్యర్థికి మద్దతునిచ్చే ఎలక్టర్ల బృందాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎలక్టర్లందరూ కలిసి ఎలక్టొరల్ కాలేజీ అవుతారు. వారంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ.. వారందరూ కలిసి ఒకే చోట సమావేశమై అధ్యక్షుడికి ఓట్లు వేయరు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎలక్టర్లు సమావేశమై తాము ముందే కట్టుబడ్డ అభ్యర్థికి ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ ఓట్లు పొందిన అభ్యర్థులు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికవుతారు.
 
 మేజిక్ ఫిగర్ 270...
 అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభల్లో.. ఆ రాష్ట్రానికి గల సభ్యుల (సెనెటర్లు, ప్రతినిధులు) సంఖ్యకు సమానంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను (ఎలక్టర్లను) ఎన్నుకుంటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏ మాత్రం ఉండదు. అదనంగా.. దేశ రాజధాని జిల్లా అయిన వాషింగ్టన్ డి.సి.కి దేశంలోని అతి చిన్న రాష్ట్రానికి గల సభ్యులకు సమానంగా ఎలక్టొరల్ కాలేజీ సభ్యులను కేటాయిస్తారు. అంటే.. ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు 435, సెనేట్ సభ్యులు 100 మంది, వాషింగ్టన్ డీసీకి ముగ్గురు అదనపు సభ్యులు.. మొత్తం కలిపి 538 మంది ఎలక్టర్లు ఈ ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికవుతారు. వీరు ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారా అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో కనీసం 270 ఓట్లు పొందిన అభ్యర్థి అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు.
 
 ఒక రాష్ట్రం ఓట్లన్నీ ఒక్కరికే..
 ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికయ్యే ఎలక్టర్లను ఆయా పార్టీలు సాధారణ ఎన్నికలకు ముం దుగా ఎంపిక చేయడం లేదా, నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ సారి నవంబర్ 8న సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు సాధారణ పౌరులు బ్యాలట్‌లో.. అధ్యక్ష పదవికి తాము కోరుకున్న అభ్యర్థికి ఓటు వేస్తారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించే విధివిధానాలకు అనుగుణంగా.. ఆ బ్యాలట్‌లో పార్టీకి చెందిన ఎలక్టర్ల పేర్లు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇలా రాష్ట్రం మొత్తం పోలైన ఓట్లను కలిపి లెక్కిస్తారు. వీటిలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి పార్టీకి చెందిన ఎలక్టర్లు ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా ఉంటారు. అంటే.. ఒక రాష్ట్రంలో సాధారణ ఓటర్లు వేర్వేరు అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేసినా.. అందులో మెజారిటీ ఓట్లు సంపాదించిన అభ్యర్థికే ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్ల ఓట్లు గంపగుత్తగా చెందుతాయి. అయితే.. మొత్తం 50 రాష్ట్రాలకు గాను 48 రాష్ట్రాల్లో ఇదే విధానం ఉంటుంది. మెయిన్, నెబ్రాస్కాలు మాత్రం పోలైన ఓట్లను బట్టి తమ ఎలక్టర్లను ఆయా అభ్యర్థులకు దామాషాలో పంచుతాయి. అంటే.. ఆ రెండు రాష్ట్రాలకు చెందిన ఎలక్టర్ల ఓట్లు.. ప్రజల ఓట్లను బట్టి వేర్వేరు అభ్యర్థులకు లభించే అవకాశముంటుంది.
 
 ఎలక్టోరల్ కాలేజీ లాంఛనమే..!
 నిజానికి ఏ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్ల ఓట్లు ఏ అభ్యర్థికి లభించాయనేదాన్ని బట్టి.. మొత్తంగా ఏ అభ్యర్థికి ఎన్ని ఎలక్టర్ల ఓట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారనేది సాధారణ ఎన్నికల్లోనే తేటతెల్లమవుతుంది. అయితే.. సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన ఎలక్టర్లంతా కలసి లాంఛనంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ ఈ సారి డిసెంబర్ 19న సమావేశమై ఈ లాంఛనాన్ని పూర్తి చేస్తుంది. ఆ రోజున ఏ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్లు ఆ రాష్ట్ర రాజధానిలోనే సమావేశమై తమ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఓట్లు వేస్తారు. ఈ ఓట్లను వచ్చే ఏడాది జనవరి 6న కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో లెక్కిస్తారు. ఎన్నిక ఫలితాలను సెనేట్ అధ్యక్షుడు లాంఛనంగా ప్రకటిస్తారు. ఒకవేళ ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఏ అభ్యర్థికీ సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో.. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ - దిగువ సభ) అధ్యక్షుడ్ని ఎన్నుకుంటుంది. అదే.. ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సెనేట్ (ఎగువ సభ) ఆ ఎన్నిక చేస్తుంది. ఇలా అరుదుగా జరుగుతుంది. చివరిసారిగా 2002 ఎన్నికల్లో ఇలా జరిగింది. ఇలా ఈ సుదీర్ఘ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన మూడు, నాలుగు నెలల తర్వాత వచ్చే ఏడాది జనవరి 20న కొత్త అధినేత అధ్యక్ష పదవి చేపడుతూ ప్రమాణ స్వీకారం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement