అమెరికా సమాజంతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం నేడు జరగబోయే పోలింగ్‌తో ముగియబోతోంది. రెండు ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సమయంలోనే ఈ ఉత్కంఠ బయల్దేరింది. డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్‌పై సోషలిస్టు భావాలుగల బెర్నీ సాండర్స్ పోటీపడటం...రిపబ్లికన్ పార్టీలో అంతవరకూ దాదాపు ‘బయటి వ్యక్తి’గా ముద్రపడిన డోనాల్డ్ ట్రంప్ తెరపైకి రావ డమేకాక ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలు చేయడం ఇందుకు కారణం. అటు సాండర్స్ అయినా, ఇటు ట్రంప్ అయినా లేవనెత్తిన అంశాలు కూడా కీలకమైనవి. ఆ అంశాలు వర్తమాన అమెరికా సమాజం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్య లను ప్రతిఫలిస్తాయి. అవి ఆ సమాజం అంతరాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని, వివక్షను విప్పి చెబుతాయి. అక్కడి అప్రజాస్వామిక పోకడలను ఎత్తిచూపుతాయి. ప్రపంచంపై తానే రుద్దిన ప్రపంచీకరణ విధానాల పర్యవసానాలను అమెరికా కూడా చవిచూడటాన్ని వెల్లడిస్తాయి.
ప్రపంచీకరణను అంతక్రితం ఎలా చూసినా...వాణిజ్యం, పెట్టుబడి, వలసలు తదితర అంశాల్లో ఎలాంటి ఆంక్షలూ లేకపోవడమే అసలైన ప్రపంచీకరణ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 2000 సంవత్సరంలో ప్రకటించాక అది కొత్త పుంతలు తొక్కింది. అది సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ రంగాలకు సైతం విస్తరించింది. ప్రపంచీకరణ వల్ల పెట్టుబడులు రావడం, వినియోగ వస్తు వులు వెల్లువలా వచ్చిపడటం, పేరెన్నికగన్న బ్రాండ్లు అందుబాటులోకి రావడం అందరినీ సమ్మోహనపరిచాయి. మెరుగైన వస్తువులు చవగ్గా లభ్యంకావడానికి అది తోవలుపరిచింది. కొత్త కొత్త రంగాల్లో అవకాశాలను పెంచింది. అదే సమయంలో యాంత్రికీకరణ పెరిగింది. ఉపాధి దెబ్బతింది. పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థలు లేని చోట పెట్టుబడుల ప్రవాహం కరెన్సీ సంక్షోభాలను సృష్టించింది.
సహజ వనరులను బహుళజాతి సంస్థలకు అప్పగించడం, విదేశీ పెట్టుబడుల కోసం పర్యావరణ అంశాల్లో రాజీపడటం ఎక్కువైంది. ఆదాయ వ్యత్యాసాలు అధికమయ్యాయి. వీటిల్లో అనేక అంశాలు అమెరికాను కూడా వేధించడం మొదలెట్టాయి. తయారీ రంగంలో సింహభాగం చైనాకు తరలడంతో ఆ దేశంలో ఉపాధి తీవ్రంగా దెబ్బ తింది. దీనికితోడు వలసొచ్చినవారు తక్కువ వేతనాలకు పనిచేయడానికి ముందు కొస్తుండటం శ్వేతజాతీయులకు శాపమైంది. ఆర్ధిక తారతమ్యాలు హెచ్చాయి. సంపద కేంద్రీకరణ పెరిగింది. సామాజిక సంక్షేమ పథకాలు ఉండవు గనుక ఈ పరి ణామాలన్నీ సాధారణ పౌరులను మరింతగా కుంగదీశాయి.
ఇలాంటి అంశాలను బెర్నీ సాండర్స్ ఒక కోణం నుంచి చూస్తే డోనాల్డ్ ట్రంప్ మరో కోణం నుంచి చూశారు. సాండర్స్ కుబేరులపై అధిక పన్నుల గురించి మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెడతానన్నారు. రాజకీయ రంగంపై కార్పొరేట్ల అజ్మాయిషీని పోగొడతానన్నారు. ట్రంప్ మాత్రం శ్వేత జాతి అహం కారాన్ని రెచ్చగొట్టారు. భారత్, చైనా తదితర దేశాలనుంచి వలసొస్తున్నవారు ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు గనుక వారి కట్టడికి చర్యలు తీసుకుంటానన్నారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తానన్నారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అవమానకరమైన రీతిలో మాట్లాడారు. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా ప్రపంచంలో ఇతరచోట్ల వలే అక్కడ కూడా మహిళలపై వివక్ష అధికం. మహిళలపై ఉండే అన్ని రకాల వివక్షనూ పారదోలాలన్న అంతర్జాతీయ ఒడంబడిక(సెడా)ను ధ్రువీకరించడానికి అదింకా సిద్ధపడలేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదో ఏటా నివేదికలు తయారు చేసే అలవాటున్న అమెరికాలో ఈ దుస్థితి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
1789 మొదలుకొని అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న అమె రికాలో ఒక మహిళ బరిలో నిలబడటం ఇదే మొట్టమొదటిసారని గుర్తుంచుకుంటే ఆ వివక్ష ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. 1848లో అమెరికాలో జరిగిన తొలి మహిళా హక్కుల సదస్సు స్త్రీ, పురుష సమానత్వం కావాలని, మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలని కోరితే 1919 వరకూ వారికి ఓటు హక్కే లేదు. దీన్నంతటినీ చక్కదిద్దవలసిన తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకుని రంగం లోకి దిగిన ట్రంప్ ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చారు. మహిళలపై గతంలో అత్యంత నీచంగా చేసిన వ్యాఖ్యానాలకు సంబంధించిన వీడియోలు బయటపడినా క్షమాపణ చెప్పడం సంగతలా ఉంచి...అలాంటి అభిప్రాయాలుండటం తప్పేనని విచారం వ్యక్తం చేయడానికి కూడా ఆయనకు నోరు పెగల్లేదు. డెమొక్రటిక్ పార్టీ విధానాలనూ, వివిధ అంశాల్లో హిల్లరీ క్లింటన్ వైఖరినీ విమర్శించి, అందులోని లొసుగులను ఎత్తి చూపాల్సిన ట్రంప్ అందుకు భిన్నంగా ఆమెను మహిళగా మాత్రమే చూసి కించప రచడం ప్రజాస్వామికవాదులందరినీ కలవరపరిచింది. హిల్లరీ వ్యతిరేకులు సైతం ఆమెకే ఓటేద్దామని నిర్ణయించుకునేలా చేసింది.
అమెరికా ఇప్పుడు ట్రంప్ అనుకూల, ట్రంప్ వ్యతిరేక శిబిరాలుగా విడి పోయింది. ఒక మహిళ తొలిసారి అధ్యక్ష బరిలో ఉండటంపై ఉత్సాహం ఉరక లెత్తాల్సి ఉండగా అధ్యక్షురాలిగా ఎన్నికైనాక ఆమె తీసుకోనున్న నిర్ణయాలపై ఆందో ళన అలుముకుంది. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు హిల్లరీ సక్రమంగా వ్యవహ రించలేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటి పర్యవసానంగానే వివిధ సర్వేల్లో హిల్లరీ కొన్నిసార్లు ట్రంప్ కంటే వెనకబడ్డారు. తాజా సర్వేల్లో సైతం ఇద్దరి మధ్యా వ్యత్యాసం చాలా తక్కువుంది. ఈమెయిల్ వివాదంలో హిల్లరీ నిర్దోషి అని చివరి నిమిషంలో ఎఫ్‌బీఐ ప్రకటించడం ఆమెకు ఊరటనిచ్చే అంశం. అయితే ట్రంప్‌కు బదులు రిపబ్లికన్ అభ్యర్థిగా మరెవరున్నా ఆమెను సునాయాసంగా ఓడించేవారన్న అభిప్రాయం ఉంది. అమెరికా- రష్యాల మధ్యా...అమెరికా- చైనాలమధ్యా విభే దాలు ముదురుతున్న దశలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఆ దేశాన్నీ, ప్రపంచాన్నీ ఎలాంటి దిశగా తీసుకెళ్లగలవో చూడాల్సి ఉంది.
ఎవరిది పైచేయి?
Published Tue, Nov 8 2016 1:23 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
Advertisement
Advertisement