వాషింగ్టన్ : అగ్రరాజ్య అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరిలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే అతి త్వరలో ఆరిజోనా ప్రాంతంలో పర్యటించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారులు వివరాలను వెల్లడించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ట్రంప్ నిర్ణయించినట్లు అగ్రరాజ్య అధికారులు తెలిపారు. వైరస్ ప్రభావం ఎక్కువగా లేని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. కాగా దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధ్యక్ష ఎన్నికల వాయిదా పడే అవకాశం ఉందంటూ తొలుత వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ ఖండిస్తూ తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. (వియత్నాం యుద్ధాన్ని మించి..)
దీని ప్రకారం నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ దేశ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. 60వేలకు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. పదిలక్షల కంటే ఎక్కువమంది కరోనా బాధితులున్న తొలి దేశంగానూ అమెరికా ఓ రికార్డు సృష్టించింది. అయితే పరిస్థితి తీవ్రత ఎక్కువ ఉండటంతో ఎన్నికలను కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలంటూ పలువురు అమెరికన్ ప్రతినిధిలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32 లక్షలు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment