
మీ పిల్లల గదిలో టీవీ ఉందా?
అయితే ఊబకాయం ముప్పు తప్పదట!
లండన్: మీ పిల్లల గదిలో టీవీ ఉందా? అయితే అర్జెంటుగా దానిని తీసేయండి. ఎందుకంటే... భవిష్యత్తులో మీ పిల్లలు ఊబకాయంబారిన పడడానికి అదే కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గదిలో టీవీ ఉండడం వల్ల ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోయే అవకాశముందని, దీనివల్ల మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ముప్పు మరింతగా పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్(యూఎల్‌సీ) చేసిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది.
ఏడేళ్ల నుంచే పిల్లల గదిలో టీవీ ఏర్పాటు చేయడం ద్వారా.. వారు ఊబకాయంబారిన పడే ముప్పు 30 శాతం పెరుగుతుందని, 11 ఏళ్లప్పుడు ఏర్పాటు చేస్తే ఒబేసిటీ ముప్పు 20 శాతం పెరుగుతుందని తమ పరిశోధనలో తేలినట్లు యూఎల్‌సీ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘గదిలో పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే... టీవీ చూసే స్వేచ్ఛ పెరుగుతుంది. కదలకుండా కూర్చోవడం, గంటల తరబడి టీవీ కార్యక్రమాలను వీక్షించడంవల్ల శారీరక శ్రమ తగ్గి, బరువు పెరుగుతారు. ఇది క్రమేపీ ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చు. దాదాపు 12,556 మంది పిల్లలపై పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామ’ని యూఎల్‌సీ ప్రొఫెసర్ యాంజా హీల్‌మన్ తెలిపారు.