బాస్ అంటే ఇతడేరా!
కాలిఫోర్నియా: జీవితాల్లో వెలుగులు నింపే తల్లి, తండ్రి, గురువు, అతిథుల తర్వాతి స్థానాన్ని బాస్‌కే ఇచ్చేయాలని ట్విట్టర్ ఉద్యోగులు కోరుతూ ఉండొచ్చు! ఎందుకంటారా.. వాళ్ల బాస్, అదేనండీ ట్విట్టర్ కంపెనీ సీఈవో జాక్ డోర్సీఉద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించాడు. కంపెనీలో తనకున్న షేర్లలో 33 శాతాన్ని ఉద్యోగుల సహాయ నిధికి ధారాదత్తం చేశాడు. ఉద్యోగుల పేరిట బదిలీ చేసిన ఆ షేర్ల విలువ 197 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 1,277 కోట్ల రూపాయలు!
షేర్లు ఇవ్వడాన్ని ఉద్యోగులపై తిరిగి పెట్టుబడిపెడుతున్నట్లు (రీఇన్వెస్ట్మెంట్)గా జాక్ అభివర్ణించినా, అతడి నిర్ణయం వేలాది ఉద్యోగుల జీవితాల్లో భారీ మార్పులకు నాంది పలకడం ఖాయం. వేలకోట్ల విలువైన ట్విట్టర్ కంపెనీలో అతడికి 3.2 శాతం వాటా ఉంది. అందులో నుంచి 33 శాతం అంటే కంపెనీలో 1 శాతం విలువైన షేర్లు ఉద్యోగులకు పంచేయడం ద్వారా అతని వాటా 2.2 శాతానికి తగ్గింది. అయినా సరే ఉద్యోగుల సంక్షేమమే ప్రధానమన్నది ఆయన తలంపు.
అయితే సీఈవోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులైనా గడవక ముందే జాక్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబూ ఉంది! గత వారమే 336 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. మిగతా ఉద్యోగులకు తనపట్ల నమ్మకాన్ని, పని పట్ల మరింత ప్రేమను కల్గించేందుకే షేర్ల గాలం వేసినట్లు తెలిసింది. లోగుట్టు ఏదైనా.. ఉద్యోగులు మాత్రం మంచి ఖుషీగా ఉన్నారు.