
మేం నోరు తెరిస్తే భారత్‌లో కల్లోలమే!
• హ్యాకింగ్ సంస్థ లీజియన్ గ్రూపు ప్రకటన
• అపోలోతోపాటు 40వేల భారత సర్వర్లకు యాక్సెస్
• భారత ప్రముఖుల వివరాలున్నాయని వాషింగ్టన్ పోస్టుకు వెల్లడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత్‌లో రాజకీయ, జర్నలిజంతోపాటు పలురంగాల ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసిన ‘లీజియన్’గ్రూపు తాజాగా మరో బాంబులాంటి వార్తను ప్రకటించింది. వాషింగ్టన్ పోస్టుకు మొబైల్ చాటింగ్ ద్వారా ఇచ్చిన ఇంటర్వూ్యలో లీజియన్ గ్రూపు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లీజియన్ క్రూ (ఎల్‌సీ) పేరుతో జరిపిన చాటింగ్‌లో.. అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయని.. అందులో భారత రాజకీయ ప్రముఖుల డేటా ఉందని వెల్లడించింది. ‘మా దగ్గరున్న సమాచారాన్ని బహిరంగపరిస్తే.. భారత్‌లో కల్లోలం తప్పదు’అని స్పష్టం చేసింది.
చెన్నై అపోలోలో తమిళనాడు దివంగత సీఎం జయలలిత 75 రోజుల పాటు చికిత్స తీసుకోవటం, చివర్లో అపోలో కేంద్రంగానే తమిళ రాజకీయాలు నడిచిన నేపథ్యంలో లీజియన్ గ్రూపు ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది. అయితే సమాచారం విడుదలపై మాత్రం ఎల్‌సీ ఎటువంటి వివరాలివ్వలేదు. కానీ, పలు భారత సర్వర్ల నుంచి సేకరించి, క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా ఉందని మాత్రం చెప్పింది. ఈ సంస్థ చాలాకాలంగా ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను హ్యాక్ చేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వివాదాస్పద పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్ కుమార్ వంటి ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసింది. ‘కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నంతో భారత్‌లోని 40వేలకు పైగా సర్వర్ల సమాచారంపై పట్టుచిక్కింది.
బర్ఖాదత్ ట్విటర్ అకౌంట్ హ్యక్ ద్వారా ఆమె మెయిల్స్‌కు సంబంధించి 1.2 జీబీ డేటాను డంప్ చేశాం’ అని లీజియన్ ప్రతినిధి వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్టు ప్రతినిధి తెలిపారు. తమ తదుపరి లక్ష్యం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీయేనని చెప్పారన్నారు. ‘భారత్‌లో ట్విటర్ ఖాతాల హ్యాక్‌కు సంబంధించి ప్రజల సహకారం కావాలి. దీనికి మద్దతు తెలిపేవారు legion&group@sigaint.orgకు మెయిల్ చేయండి. అక్రమార్కుల వివరాలివ్వండి’ అని లీజియన్ క్రూ ట్విటర్ ద్వారా వెల్లడించింది.