ట్విట్టర్ ఉద్యోగులపై వేటు
ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనుంది. తమ కంపెనీకి చెందిన మొత్తం ఉద్యోగులలో
8 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈవో జాక్ డోర్సీ మంగళవారం సూత్రప్రాయంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో 336 మంది ఉద్యోగులపై వేటు పడనుంది. గత కొంత కాలంగా కంపెనీ లాభాలు తగ్గడంతో, వేతనాల భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డోర్సీ తెలిపారు.
ట్విట్టర్కు ఉన్న ఆదరణ తగ్గుతుండడం మరియు నూతన వినియోగదారులను ఆకర్షించడంలో కంపెనీ విఫలం కావడం వంటి కారణాలు ట్విట్టర్ తిరోగమనానికి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర నెట్వర్కింగ్ సైట్లయిన ఫేస్బుక్, వాట్సప్ల మాదిరిగా వినియోగదారులను ఆకర్షించడంలో విఫలం కావడంతో 9 సంవత్సరాల చరిత్ర గల ట్విట్టర్ సంక్షోభంలో పడినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ను వాడడం వినియోగదారులకు కొంత సంక్లిష్టంగా ఉందని స్వయానా సీఈవో డోర్సీ వెల్లడించడం పరిస్థితికి అద్దం పడుతోంది.