ప్రాణాలకు తెగించి ఇద్దరు మహిళల సాహసం
రక్కా: ఐదేళ్లుగా అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా ప్రస్తుతం ఐసిస్ టెర్రిరిస్టుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడిపోతోంది. అలాంటి సిరియాలో, ముఖ్యంగా రక్కాలో టెర్రిరిస్టుల పైశాచికత్వంలో ఛిద్రమైన ప్రజా జీవితం ఎలా ఉందో బయటి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇద్దరు మహిళలు సాహసించారు. బయటపడితే మరణ శిక్ష తప్పదని తెల్సినా ఆ ఇద్దరు మహిళలు ఓ వీడియో కెమేరాను రహస్యంగా తమ దుస్తుల్లో దాచుకొని అక్కడి జీవన చిత్రాన్ని ఓ డాక్యుమెంటరీగా తీశారు. దాన్ని స్వీడన్‌ను చెందిన ‘ఎక్స్‌ప్రెసెన్ టీవీ’ ప్రసారం చేసింది.
తమ ఖాలీఫా రాజ్యానికి రాజధానిగా ఐసిస్ టెర్రిరిస్టులు చెప్పుకుంటున్న రక్కా నగరంతోపాటు పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఆ డాక్యుమెంటరీ తెలియజేస్తోంది. మూడేళ్ల క్రితం కళకళలాడుతూ కనిపించిన రక్కా ఇప్పుడు పూర్తిగా బోసిపోయింది. జనం అక్కడక్కడా తప్పించి ఎక్కడా కనిపించడం లేదు. సాయుధులు ఓ పక్క నడుచుకుంటూ కనిపించారు. మరో పక్క శిథిల భవనాలు కనిపించాయి. వాటిలో సూఫీలకు, సున్నీలకు పవిత్రమైన ఉవాయిస్ అల్ ఖర్నీ మసీదు శిథిలాలు కూడా ఉన్నాయి. ఇంకోపక్క ఆర్మీనియన్ క్యాథలిక్ చర్చి రూపురేఖలు మార్చేసి ఇస్లాం టెర్రిరిస్టులు దాన్ని తమ సైన్యం ప్రధాన కార్యాలయంగా మార్చుకున్నారు.
డాక్యుమెంటరీని చిత్రీకరించిన ఇద్దరు సాహస మహిళలు ముఖాలకు కూడా బురఖాలు ధరించి కనిపించారు. రక్కాపై దాడులు తీవ్రమయ్యాయి. ఎక్కడికెళ్లాలో తెలియని వారు తప్పించి అందరూ నగరాన్ని విడిచి పారిపోయారని, ఐసిస్ టెర్రిరిస్టుల తరఫున పోరాడుతున్న విదేశీ సాయుధులు స్థానికుల ఐడి కార్డులు లాక్కొని టర్కీకి పారిపోతున్నారని ఆ మహిళలు తెలిపారు. తాము ప్రత్యక్షంగా చూసిన హింసాత్మక సంఘటనల గురించి వారు వివరించారు. తాము ఓ యువకుడి తలనరికి అత్యంత కిరాతంగా చంపేసిన దృశ్యాన్ని చూశానని ఇద్దరు మహిళల్లో ఊమ్ మొహమ్మద్‌గా చెప్పుకున్న మహిళ వివరించారు. ఓ యువకుడిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి, నల్లటి దుస్తులు ధరించిన ఐసిస్ టెర్రిరిస్టులు ఓ పక్క వరుసగా లైన్‌లో నిలబడి ఉండగా, ఓ పెద్ద కరవాలం ధరించిన ఓ వ్యక్తి ఆ యువకుడి తల నరకి చంపేశాడని, ఆ తర్వాత మొండెం నుంచి వేరువడిన తలకు ఓ బరిసే గుచ్చి కూడలిలో వేలాడదీశారని, మొండెంతో ఉన్న శరీరాన్ని నడిరోడ్డులో పడేశారని, దానిపై నుంచి వాహనాలను నడిపించి ముక్కలు ముక్కలయ్యేలా చేశారని ఆ మహిళ గద్గద స్వరంతో వివరించారు. డాక్యుమెంటరీ మొదటి నుంచి చివరి వరకు వారిద్దరి స్వరం గద్గదంగానే వినిపించింది. ఒకప్పుడు సిరియాలో మహిళలు ముఖాలకు బురఖాలు లేకుండా స్వేచ్ఛగా సంచరించేవారని, ఇప్పుడు వారికి ఏ హక్కులు లేవని రెండో మహిళ అన్నారు. ఏ నాటికైనా సిరియాకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
సిరియాలో గత ఐదేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు రెండున్నర లక్షల మంది మరణించగా, దాదాపు కోటి మంది వలసపోయారని ఐక్యరాజ్యసమితి లెక్కలు తెలియజేస్తున్నాయి. 2013లో ఐసిస్ టెర్రిరిస్టులు రక్కాను స్వాధీనం చేసుకున్నారు.