
వాట్సాప్ బీటాలో రెండు కొత్త ఫీచర్లు
వాషింగ్టన్ : వాట్సాప్ బీటా (ప్రయోగాత్మక సేవలు)లోని కొన్ని వెర్షన్లలో మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రూప్ చాట్‌లలో లైవ్ లొకేషన్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీంతో గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఎక్కుడున్నారో మిగిలిన వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. సభ్యులంతా ఒకచోట కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరెంత దూరంలో ఉన్నారో తెలుసుకోడానికి ఇది బాగా ఉపయోగపడనుంది.
ఇందుకోసం వినియోగదారులు గ్రూప్‌లోకి వెళ్లి ‘షో మై ఫ్రెండ్స్’అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో ఫీచర్ విషయానికి వస్తే వినియోగదారులు ఒకసారి పంపిన సందేశాలను కూడా మళ్లీ వెనక్కు తీసుకుని మార్పులు చేసి పంపొచ్చు. అయితే సందేశాన్ని పొందిన వ్యక్తి అప్పటికి దానిని చదివి ఉండక పోతేనే ఇది సాధ్యమవుతుంది. వాట్సాప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు తెలియజేసే @WABetaInfo అనే సంస్థ ఈ వివరాలను అందించింది.