అంత ఆపదలోనూ ఊహించని గిఫ్ట్
హెబె హవెన్: ఈశాన్య ఆసియా దేశాలను తుఫాన్లు పట్టి కుదిపేస్తున్నాయి. చైనా ను పొరుగున ఉన్న హాంకాంగ్‌ను టైఫూన్ ‘హటో’ కకావికలం చేస్తోంది. సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో నిరాశ్రయులైన ప్రజలకు తినేందుకు తిండి కూడా కరువు అవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే నీట మునిగిన ఇళ్లలోనే సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
అయితే సయ్ కుంగ్ పెనిన్‌సులా లోని హెబ్ హెవెన్ ప్రాంతంలో మాత్రం అంత ఆపదలోనూ ఓ వ్యక్తికి అనుకోని బహుమతి లభించింది. ఓవైపు భారీ వర్షం.. మరోవైపు భయంకర వరదలో ఎవరో పంపినట్లుగా ఓ పడవ(యాట్చ్) కొట్టుకుని వచ్చింది. అంతే ఆనందంతో ఉబ్బి తబ్బిబి అయిపోయిన అతగాడు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
‘నాకు పడవ దొరికింది. ఈ తుఫాన్‌లో నా ప్రాణాలు రక్షించుకునేందుకు మార్గం సుగమమైంది’ అని హాంకాంగ్ హైకర్స్ లిమిటెడ్ డైరక్టర్ స్టీవ్ ఫెబై ఎఫ్‌బీ లో సందేశం ఉంచాడు. పైగా పక్కనే మరో పడవ కూడా కొట్టుకొచ్చిందంటూ ఫోటోలను కూడా అప్‌లోడ్ చేశాడు. ఆ పడవలు తమవేనంటూ ఎవరూ ముందుకు రాలేదని స్టీవ్ చెబుతున్నాడు. ప్రస్తుతం ట్విట్టర్, ఫేస్ బుక్‌లో ఆ వీడియోకు మంచి స‍్పందన వస్తోంది. టైఫూన్ దాటికి చైనా, హాంకాంగ్‌లు నష‍్టం భారీగా జరగ్గా, జుహియా సిటీలో అది తీవ్రస్థాయిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.