ప్లానెట్ ఓషన్ అండర్‌వాటర్
సముద్ర గర్భంలో హోటల్.. మత్స్యాలతో ముచ్చట్లాడుతూ.. జలచరాలతో జాలీగా గడిపే అద్భుతమైన ప్రదేశం.. ఇప్పటికే ఇలాంటి హోటళ్ల డిజైన్లు కొన్ని వచ్చాయి. అవన్నీ డిజైన్ల స్థాయిలోనే ఉండిపోయాయి. చిత్రంలోని ప్లానెట్ ఓషన్ అండర్‌వాటర్ హోటల్ మాత్రం త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే.. ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి సముద్రగర్భ హోటల్‌గా దీనికి పేటెంట్, ట్రేడ్‌మార్క్ అనుమతులను అమెరికా తాజాగా జారీ చేసింది.
దీంతో ఈ హోటల్‌ను నిర్మించేందుకు అనువైన ప్రదేశాల ఎంపిక కొనసాగుతున్నట్లు ఈ హోటల్ డిజైనర్ టోనీ వెబ్ తెలిపారు. ఈజిప్ట్, మలేసియా, హవాయి, బహమాస్ వంటివాటిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు చెప్పారు. 28 అడుగుల లోతున నిర్మించే ఈ హోటల్‌కు అతిథులు ఎలివేటర్ సాయంతో వెళ్తారు. అంతేకాదు.. తుపాన్లు వంటివాటిని తప్పించుకునేందుకు వీలుగా.. ఈ హోటల్ ఎలక్ట్రో మెకానికల్ ప్రొపల్షన్ టెక్నాలజీ సాయంతో నౌకలా ప్రయాణిస్తుంది కూడా.. ఎవరికైనా కావాలంటే తాము ఈ హోటల్‌ను నిర్మించి ఇస్తామని టోనీ వెబ్ చెబుతున్నారు. 12 గదుల విలాసవంతమైన హోటల్‌కు ఎలివేటర్‌తో కలిపి రూ.135 కోట్లు అవుతుందని చెబుతున్నారు.