వాషింగ్టన్ : గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో తెలియదు. ఒక వేళ ఉంటే...అనే ఊహకు రూపమిస్తూ ఎన్నో సినిమాలు, వార్తలు, వార్తాకథనాలు. చివరకు భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ గ్రహాంతర వాసుల గురించి మాట్లాడారు. గ్రహాంతర వాసులు ఉంటే వారు మనకంటే శక్తివంతులు,తెలివిగలవారై ఉంటారని చెప్పారు. గ్రహాంతరవాసుల ఉనికిని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. గ్రహాంతరవాసులను ఎవరు చూడలేదు కానీ ‘ఫ్లైయింగ్ సాసర్’ అని పిలిచే ‘యూఎఫ్‌ఓ’లను చూశామని చాలామంది చెప్పారు. వీటి ఫోటోలు కూడా పేపర్లలో వచ్చాయి. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఈ మధ్యే అమెరికా రక్షణ శాఖ వారు విడుదల చేసిన ఒక వీడియో. 35సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారి ఎఫ్/ఏ-18 సూపర్ హర్నెట్ మిలిటరీ జెట్ విమానం తూర్పు తీరం వెంట ఒక అసాధారణ వస్తువును కనుగొన్నది.అది చూడ్డానికి గుడ్డు ఆకారంలో ఉండి చాలావేగంతో ప్రయాణిస్తుంది. ఈ వింత వాహనాల గురించి తెలుసుకోవడానికి వీరు 2007 నుంచి 2012 వరకు ‘అడ్వాన్స్‌డ్ ఏవీయేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్’ అనే కార్యక్రమం ద్వారా ప్రయోగాలు చేశారు.
గతంలో...
1947-1969 మధ్యకాలంలో దాదాపు 12వేల కంటే ఎక్కువ మంది వీటిని చూశామని చెప్పారు. కానీ ఎవ్వరూ నిరుపించలేకపోయారు. 2004లో అమెరికాకు చెందిన నావీ పైలెట్ కమాండర్ డెవిడ్ ఫ్రేవర్ తాను గతంలో ఎన్నడూ చూడని ఒక అరుదైన వస్తువు ఆకాశంలో విహరించడం చూశానని చెప్పారు. ఆ వస్తువు తన విమానం అంత పెద్దగా ఉండి అత్యధిక వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. 80,000 అడుగుల నుంచి 20,000 అడుగులు కిందకు ప్రయాణించిన ఆ వస్తువు అనంతరం కనిపించకుండా పోయిందని చెప్పారు. ఫ్రేవర్ మాట్లాడుతూ ఆ వస్తువు సమీపంలోకి వెళ్లినప్పుడు నా ముక్కును వెనక్కు నెట్టుతున్నట్లు అనిపించింది. అంత వేగంతో ప్రయాణించే వస్తువును నా జీవితంలో ఇంతవరకూ చూడలేదు అన్నారు.
ఇన్నేళ్ల తర్వాత...
మళ్లీ 13 సంవత్సారాల తర్వాత సరిగ్గా అలాంటి వస్తువునే స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారి ఎఫ్/ఏ-18 సూపర్ హర్నెట్ మిలిటరి జెట్ విమానం గుర్తించింది. ఈ వస్తువు కచ్చితంగా భూమికి సంబంధించినది మాత్రం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment