
మళ్లీ వివాదంలో యూఎస్ ఎయిర్‌లైన్స్
న్యూయార్క్: అమెరికా విమానయాన సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యి త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో నుంచి దింపేసింది. విమానంలోని సెక్యూరిటీ సిబ్బందితో బలవంతంగా బయటకు తోయించింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు వైద్యుడైన ఓ ప్యాసింజర్‌ను రక్తం వచ్చేలాగా కొట్టి విమానంలో నుంచి ఈడ్చి పారేసిన ఘటనతో యూఎస్ విమానయాన సంస్థ ఇబ్బందుల్లో పడగా వారం తిరగకుండానే ఇది మరో ఘటన. వివరాల్లోకి వెళితే.. మైఖెల్ హాల్, అంబర్ మ్యాక్స్‌వెల్ అనే ఇద్దరికీ ఇటీవలె నిశ్చితార్థం అయింది.
వారిద్దరు కలిసి హ్యూస్టన్ నుంచి టెక్సాస్‌కు బయలుదేరారు. ఆ క్రమంలో ఇద్దరు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కోస్టారికా విమానం ఎక్కారు. అయితే, అనూహ్యంగా వారిద్దరి ప్రవర్తన బాగాలేదని, నిబంధనలు పాటించలేదనే కారణంతో వారిని బలవంతంగా దించివేశారు. దీనిపై విమానయాన సంస్థ వివరణ ఇస్తూ వారిద్దరు తాము తీసుకున్న సీట్లలో కాకుండా వేరే సీట్లలో కూర్చున్నారని, పైగా నిబంధనలు పాటించలేదని చెప్పారు.
దీంతో ప్రవర్తన సరిగా లేదని దిగిపోవాలని చెప్పారే తప్ప వారినెవరూ బలవంతంగా దించివేయలేదని అన్నారు. పైగా వారికి రాత్రి పూట ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసి మరో విమానం టికెట్లు ఇచ్చి ఉదయాన్నే పంపిచామని వివరణ ఇచ్చారు. అయితే, తమకు అప్‌గ్రేడ్ సీట్లు ఇవ్వమన్నా ఇవ్వలేదని, తమ సీట్లలో ఎవరో వ్యక్తి కాళ్లు పెట్టి నిద్రపోయాడని, అందుకే తాము వేరే సీట్లలో కూర్చున్నట్లు చెప్పారు.