శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని డెన్వర్, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్‌లో చోటుచేసుకున్న బోయింగ్ విమాన ప్రమాదాలు కలకలం రేపాయి. డెన్వర్‌లో బయలుదేరిన కొద్దిసేపటికే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు నేలపై పడడం, అత్యవసర ల్యాండింగ్ ఘటనలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాదానికి గురైన ఆ బోయింగ్–777 రకం విమానానికి ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉందని గుర్తించింది.
ఈ రకం ఇంజిన్ ఉన్న అన్ని బోయింగ్–777 విమానాలను తనిఖీ చేయాలనీ, వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టాలని ఆదేశించింది. సోదాలు పూర్తయ్యే వరకు ఆ మోడల్ ఇంజిన్ ఉన్న విమానాలను ఉపయోగించరాదని బోయింగ్ కూడా విమానయాన సంస్థలకు ఎఫ్‌ఏఏ సూచించింది. విమానయానసంస్థలు, అధికారులతో సహకరించేందుకు తమ బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తెలిపింది. డెన్వర్ ఘటనతో 24 విమానాలను వినియోగించరాదని నిర్ణయించినట్లు ఆ సంస్థ తెలిపింది.
డెన్వర్ శివారు ప్రాంతంలో ఆదివారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్–777 విమానం ఇంజిన్ నుంచి పొగలు రావడంతోపాటు, రెక్క, తదితర భాగాలు నేలపై పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి, పరీక్షించగా విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు రెండు విరిగిపోగా మిగతా వాటికి పగుళ్లు వచ్చినట్లు తేలింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు 231 మంది, 10 మంది సిబ్బంది సహా ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఈ రకం ఇంజిన్ ఉన్న బోయింగ్ విమానాలు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు మాత్రమే ఉన్నాయి. డెన్వర్ ఘటన నేపథ్యంలో జపాన్ ఎయిర్‌వేస్, ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ సంస్థలు తమ 32 బోయింగ్ రకం విమానాలను ప్రస్తుతానికి నడపరాదని నిర్ణయించాయి.
నెదర్లాండ్స్ ఘటన..
నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్‌లో బోయింగ్–747 రకం సరకు రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలోనూ డెన్వర్ ఘటనకు కారణమైన ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉండటం గమనార్హం. లాంగ్ టెయిల్ ఏవియేషన్‌కు చెందిన ఈ విమానం మాస్ట్రిచ్ నుంచి న్యూయార్క్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరి కొన్ని నిమిషాలకే పొగలు రేగి, ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు పడిపోవడం మొదలైంది. వీటి కారణంగా వృద్ధురాలు, బాలుడు గాయపడ్డారు. ఇంజిన్ భాగాల తాకిడికి మీర్సెన్‌లోని పలు గృహాలు దెబ్బతిన్నాయి. ఈ విమానాన్ని పొరుగునే ఉన్న బెల్జియంలోని లీజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే అందులోని నాలుగు ఇంజిన్లలో ఒకదాని నుంచి మంటలు లేచాయని డచ్ ఎయిర్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఇంజిన్‌లోకి ఒక వస్తువు అడ్డుపడటంతో టర్బైన్ బ్లేడ్‌లు విరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అన్నారు.
మా గగనతలంలోకి రావద్దు
డెన్వర్ ఘటన నేపథ్యంలో యూకే స్పందించింది. ప్రాట్ అండ్ విట్నీ తయారీ ఇంజిన్లున్న బోయింగ్–777 విమానాలు తమ గగనతలంలో ప్రయాణించరాదంటూ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విమానాలు యూకే ఎయిర్‌లైన్స్‌లో లేవనీ, వీటి వినియోగాన్ని అమెరికా, జపాన్, ద.కొరియా అధికారులు నిలిపివేశారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment