చైనాలో ఉగ్రవాద దాడి
- రద్దీ మార్కెట్‌లో 12కు పైగా పేలుళ్లు
- 31 మంది మృతి; 94 మందికి గాయూలు
బీజింగ్: చైనాలోని జింజియూంగ్ ప్రాంతీయ రాజధాని ఉరుంఖి పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం ఉదయం పేలుడు పదార్థాలతో నిండిన రెండు వాహనాలతో రద్దీ మార్కెట్‌లోకి దూసుకువెళ్లిన మిలిటెంట్లు 12కు పైగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో కనీసం 31 మంది మరణించగా.. 94 మంది గాయపడ్డారు. ఉదయం 7.50 (స్థానిక సమయం) ప్రాంతంలో రెన్‌మిన్ పార్క్ సమీపంలోని పార్క్ నార్త్ స్ట్రీట్ వద్ద ఉన్న రోడ్డుపక్క కంచెల్ని ఎలాంటి లెసైన్స్ ప్లేట్లు లేని వాహనాల (ఎస్‌యూవీలు)తో వేగంగా ఢీకొట్టిన మిలిటెంట్లు ఓ ఆరుబయలు మార్కెట్ లోనికి ప్రవేశించారు.
ప్రజలను ఢీకొడుతూనే చివరివరకు వెళ్లిన వారు పేలుళ్లకు పాల్పడినట్టు జింజియూంగ్ ఇఘర్ స్వయంపాలిత ప్రాంత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వాహనాల ముందు విసిరిన పేలుడు పదార్థాలు పేలిపోరుునట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ భారీ ఉగ్రదాడి కి నిషేధిత తూర్పు తర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ (ఈటీఐఎం) కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)కు, అఫ్ఘానిస్థాన్‌కు సరిహద్దు ప్రాంతమైన జింజియూంగ్ స్వాతంత్య్రం కోసం ఈ ఉగ్ర సంస్థ పోరాడుతోంది. ఉగ్రదాడికి కారకులైనవారిని కఠినంగా శిక్షిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిపింగ్ చెప్పారు.