నదులూ ఆయుధాలేనా? | Is rivers also a weapons? | Sakshi
Sakshi News home page

నదులూ ఆయుధాలేనా?

Published Mon, Oct 3 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

నదులూ ఆయుధాలేనా?

నదులూ ఆయుధాలేనా?

దాయాదుల మధ్య మండుతున్న సింధు జలాలు
 
- ‘ఉడీ’కి ప్రతిగా పాక్‌పై భారత్ ‘జల’ఖడ్గం
- నీటి వాడకం పెంచి దెబ్బతీయడానికి సిద్ధం
- ఇదే అదనుగా భారత్‌పై చైనా ‘బ్రహ్మా’స్త్రం
- బ్రహ్మపుత్రను అడ్డుకుని డ్యాముల నిర్మాణం
 
 
 (పోతుకూరు శ్రీనివాసరావు)
 నీళ్లు మండుతున్నాయి. నదులు ఆయుధాలుగా మారుతున్నాయి. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్‌పై ‘సింధు’ జలఖడ్గాన్ని ప్రయోగించడానికి భారత్ సన్నద్ధమౌతుండగా... బ్రహ్మపుత్రకు అడ్డుకట్ట వేసి భారత్‌ను ఉక్కిరిబిక్కిరిచేయాలని చైనా చూస్తోంది. నిత్యం ‘చొరబాట్ల’తో పరోక్షయుద్ధం చేస్తున్న పాకిస్తాన్‌కు అదే తగినశాస్తి అని భారత్ భావిస్తుండగా... తన పని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఇదే మంచి తరుణమని చైనా తలపోస్తోంది. ‘ఉడీ’ ఉగ్రదాడి మూలాలు పాకిస్తాన్‌లోనే ఉన్నాయని ఆధారాలతో సహా బైటపడడంతో దానిపై అన్నిరకాల చర్యలకు భారత్ సిద్ధపడుతోంది. అందులో భాగంగానే ‘సర్జికల్ స్ట్రయిక్స్’తో అదరగొట్టి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇపుడు పాకిస్తాన్‌కు ప్రాణాధారమైన సింధునదీ జలాలను బిగబట్టాలని భావిస్తోంది.

అయితే ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్, అస్సాంలతో పాటు బంగ్లాదేశ్‌కు అతి ముఖ్యమైన బ్రహ్మపుత్ర నదికి అడ్డుకట్టలు వేసే యత్నాలను చైనా వేగవంతం చేసింది. ‘మా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం బ్రహ్మపుత్ర ఉపనదికి అడ్డుకట్ట వేశాం’ అని చైనా ప్రకటించింది. అంటే ‘మా మిత్రదేశమైన పాకిస్తాన్‌ను మీరు ఇబ్బంది పెడితే మిమ్మల్ని మేం ఇబ్బంది పెడతాం’ అని చైనా చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే భారత్- పాక్ మధ్య ఘర్షణను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చైనా చూస్తున్నట్లు కూడా దీనిని బట్టి అర్ధమౌతోంది. ఏదిఏమైనా భారత్- చైనా - పాకిస్తాన్ మూడూ అణ్వాయుధ దేశాలు. వీటి నడుమ రాజుకుంటున్న నదీజలాల వివాదాలు ఏ ఘర్షణలకు దారితీస్తాయో.. ఉపఖండం భవితవ్యం ఎలా ఉండబోతోందోనని అందరూ భయంభయంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు, బ్రహ్మపుత్ర నదీ జలాల మూలాలను, మూడు దేశాల మధ్య వినిపిస్తున్న జలఘోషను ఓమారు పరిశీలిద్దాం...
 
 సింధునదీ జలాల ఒప్పందమిదీ...
 భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రపంచబ్యాంకు చొరవతో 1960 సెప్టెంబర్ 19న సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని  నెహ్రూ, పాక్ అధ్యక్షుడు జనరల్ ఆయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు.
పంజాబ్ నుంచి ప్రవహిస్తున్న బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్‌కు, సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్తాన్‌కు నియంత్రణ అధికారాన్ని కల్పించారు.
సింధు జలాలలో 20శాతం భారత్, 80శాతం పాకిస్తాన్ వాడుకునేలా హక్కులు కల్పించారు.

 భారత్ ఏం చేయాలనుకుంటోంది?
 ‘ఉడీ’ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ సమీక్షించింది. ఈ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలేమిటంటే...
పాక్ అధీనంలోని సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని సాగు, విద్యుదుత్పత్తి, నిల్వల కోసం గరిష్టంగా ఉపయోగించుకోవాలి.
కశ్మీర్‌లో సాగునీటి సమస్యలేకుండా చేయాలి.
1987లో చేపట్టిన తుల్‌బుల్ నేవిగేషన్ ప్రాజెక్టును సమీక్షించాలి.
చీనాబ్ నదిపై పాకుల్‌దుల్, సావల్‌కోట్, బుర్ఫార్ డ్యామ్‌లను వెంటనే చేపట్టి వేగంగా పూర్తి చేయాలి.

 భారత్‌కు ఏం ఉపయోగం?
సింధు జలాల వినియోగాన్ని పెంచడం వల్ల కశ్మీర్‌లో అదనంగా సుమారు ఆరు లక్షల హెక్టార్ల భూములకు సాగునీరు అందించవచ్చు.
కశ్మీర్‌అభివృద్ధి ద్వారా ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపవచ్చు.
అయితే అంతర్జాతీయ నదీజలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం భారత్‌పై మరకలా మారుతుంది. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశ హోదా ఆశిస్తున్న భారత్‌కు ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

 పాకిస్తాన్ ఏం చేస్తోంది?
 సింధు నదీ జలాల వినియోగం పెంచేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నదన్న అనుమానంతో పాకిస్తాన్ ప్రపంచబ్యాంకును ఆశ్రయించింది. పాకిస్తాన్ అటార్నీ జనరల్ అష్తార్ అసఫ్ అలీ నేతృత్వంలోని అధికారుల బృందం వాషింగ్టన్‌లో ప్రపంచబ్యాంకు సీనియర్ అధికారులను కలుసుకున్నారు. భారత్‌ను ఎలాగైనా సరే అడ్డుకుని సింధు నదీ జలాల ఒప్పందాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అర్ధించారు. జీలం, చీనాబ్ నదులపై భారత్ ఎలాంటి డ్యాములూ కట్టకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
 పాక్‌కు ఏం నష్టం?
మొత్తంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోయినా సింధు జలాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని భారత్ నిర్ణయిస్తే పాక్‌లో తీవ్ర సంక్షోభం తలెత్తుతుంది. దేశంలో మూడింట రెండువంతుల భూమి సింధునదీ బేసిన్ కిందకే వస్తుంది.
పాకిస్తాన్ వ్యవసాయానికి సింధు జలాలే ప్రధాన ఆధారం.  స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 20శాతం వ్యవసాయం నుంచే వస్తోంది. దేశంలోని 2.1 కోట్ల హెక్టార్ల సాగుభూమిలో 80శాతంపైగా సింధు నది కాల్వల పైనే ఆధారపడి ఉన్నాయి. పంజాబ్, సింధ్ రాష్ట్రాలు బాగా దెబ్బతింటాయి. కరువుబారిన పడతాయి.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వస్త్రపరిశ్రమ సింధు జలాలపై ఆధారపడి ఉంది. ఎలానంటే సింధు పరీవాహకప్రాంతంలో పత్తి ఎక్కువగా పండుతుంది. అది దెబ్బతింటుంది కాబట్టి దాని ప్రభావం వస్త్ర పరిశ్రమపై పడుతుంది.
రవాణాకు కూడా సింధునది పాకిస్తాన్‌కు చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి అవసరాలను కూడా ఈ నది తీరుస్తోంది. తాగునీటికి జనం కటకటలాడే పరిస్థితి వస్తుంది.
పాక్ మత్స్య పరిశ్రమకు కూడా సింధునది ప్రధాన ఆధారం. ఇక్కడ దొరికే అరుదైన ట్రౌట్ రకం చేపలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. సింధు జలాలు తగ్గిపోతే మత్స్యపరిశ్రమపై ఆధారపడినవారు జీవనోపాధి కోల్పోతారు.
 
 బ్రహ్మపుత్ర స్వరూపం..


 పుట్టింది: టిబెట్        పొడవు: 2,880 కి.మీ
 పరీవాహక ప్రాంతం: 5,80,000 చ.కి.మీ.

50.5 శాతం టిబెట్‌లోనూ, 33.5 శాతం భారత్‌లోనూ, 8శాతం బంగ్లాదేశ్‌లోనూ, 8శాతం భూటాన్‌లోనూ ఈ నది ఉంటుంది.
బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతంలో 63 కోట్ల జనాభా నివసిస్తోంది.
 
 బ్రహ్మపుత్రకు అనేక పేర్లు...
 బ్రహ్మపుత్ర నదికి అనేక పేర్లున్నాయి. చైనాలో దీనిని ‘యార్లాంగ్ సాంగ్‌పో’ అని పిలుస్తారు. టిబెట్‌నుంచి మనదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. అక్కడ బ్రహ్మపుత్రను ‘సియాంగ్’ అంటారు. అస్సాంలో మాత్రమే దీనిని ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు. తర్వాత ఇది బంగ్లాదేశ్‌లో ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘జమున’ అని పిలుస్తారు. ఇక్కడే పద్మానది (గంగానది), మేగ్నానదులతో కలసి చివరకు బంగాళాఖాతంలో సంగమిస్తుంది.

 చైనా ఏం చేస్తోంది?
 బ్రహ్మపుత్ర నదిపై చైనాకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఈ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడమే కాదు అత్యంత నిస్సారమైన ఉత్తరప్రాంతానికి బ్రహ్మపుత్ర నదిని మళ్లించాలని తలపోస్తోంది.
టిబెట్‌లోని జిగేజ్ వద్ద నిర్మిస్తున్న ‘లాల్హో’ ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్రహ్మపుత్ర ఉపనది ‘జియాబుకు’కి చైనా అడ్డుకట్ట వేసింది.
బ్రహ్మపుత్రపై 2014 నవంబర్‌లో ‘జంగ్ము’ భారీ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించింది. గత ఏడాది అక్టోబర్ నాటికి మొదటి యూనిట్ పని ప్రారంభించింది.
జంగ్ము ప్రాజెక్టుతో ఏడాదికి 250 కోట్ల కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని అంచనా. జంగ్ముతో పాటు మరికొన్ని ఇతర జలవిద్యుత్ కేంద్రాలను కూడా చైనా నిర్మిస్తోంది.
జలవిద్యుత్ ప్రాజెక్టులే కాదు పలు డ్యాములను కూడా చైనా నిర్మిస్తోందని, వాటికి సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచుతోందన్న విమర్శలున్నాయి.
 
 చైనా ప్రాజెక్టుల ప్రభావం ఏమిటి?
 నిజానికి టిబెట్‌లో నిర్మిస్తున్న డ్యాముల గురించిన సమాచారం చైనా బైటపెట్టడం లేదు.
బ్రహ్మపుత్ర ఉపనది జియాబుకుకు అడ్డుకట్ట వేసి నిర్మిస్తున్న ‘లాల్హో’ ఓ భారీ రిజర్వాయర్. ఇందులో 29.5 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వచేసి 30వేల హెక్టార్లు సాగుచేయనున్నారు.
‘జంగ్ము’ విద్యుత్ కేంద్రం కోసం కూడా ఓ భారీ డ్యామ్ నిర్మించిందని అంటున్నారు.
చైనా నిర్మిస్తున్న డ్యాములు, రిజర్వాయర్లలో భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయడం వల్ల భారత్, బంగ్లాదేశ్‌లు నీటి కొరతను ఎదుర్కోనున్నాయి.
చైనా డ్యాములలో ఎంత నీటిని నిల్వ చేస్తున్నారో, ఎప్పుడు ఎంత పరిమాణంలో విడుదల చేస్తారో తెలియకపోవడం వల్ల అరుణాచల్, అస్సాంలలో అకస్మాత్తుగా వరదలు వచ్చి పెను ఉత్పాతాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది.

సింధునదీ స్వరూపం..
పుట్టింది: టిబెట్    పొడవు: 3,200 కి.మీ
 పరీవాహక ప్రాంతం: 11,02,000 చ.కి.మీ



 ఈ నది 47శాతం పాకిస్తాన్‌లోనూ, 39శాతం భారత్‌లోనూ, 8శాతం టిబెట్‌లోనూ, 6శాతం ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ఉంటుంది.
సింధు పరీవాహకప్రాంతంలో 30 కోట్ల జనాభా నివసిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement