
వాషింగ్టన్: అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (అంతర్జాతీయ విద్యావైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ -యునెస్కో) నుంచి తప్పుకుంది. అంతేకాదు యునెస్కోపై ఆరోపణలు కూడా చేసింది. యునెస్కో ఇజ్రాయెల్ వ్యతిరేక విధానం అనుసరిస్తోందని, అందుకు నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అగ్రదేశ అధికార ప్రతినిధి హెదర్ నవర్ట్ వెల్లడించారు.
యునెస్కో కొత్త డైరెక్టర్ కోసం ఓటింగ్ వెళ్తున్న సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద చర్చను లేవదీసినట్లయింది. 2011లో పాలస్తీనా అథారిటీకి యునెస్కోలో చోటిచ్చినప్పటి నుంచి ఆ సంస్థకు నిధుల పంపిణీని అమెరికా నిలిపి వేసింది. కానీ, పారిస్‌లోని యునెస్కో హెడ్‌క్వార్టర్స్‌లో మాత్రం తమ కార్యాలయాన్ని కొనసాగిస్తోంది. కొంతకాలంగా యునెస్కో తీసుకుంటున్న యాంటీ ఇజ్రాయెల్ విధానాలపై యూఎన్‌కు అమెరికా అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నిక్కీ హేలీతోపాటు పలువురు సీనియర్ అధికారులు విమర్శిస్తూనే ఉన్నారు.