'జిహాదీ జాన్'పై అమెరికా బాంబుల వర్షం!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు సంబంధించిన కరడుగట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ) అంతు చూసేందుకు అమెరికా బయలుదేరింది. వేలమంది కంఠాలను తెగకోసిన ఆ నరరూప రాక్షసుడిని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. గుట్టుచప్పుడు కాకుండా జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
'ఆపరేషన్ (దాడులు) జరిపిన ప్రాంతంలో పరిస్థితిని ప్రస్తుతం అంచనా వేస్తున్నాం. జిహాదీ జాన్ మృతిపై ఇంకా వివరాలు తెలియలేదు. తెలిస్తే తప్పకుండా ఆ విషయాలు తెలియజేస్తాం' అని పెంటగాన్ అధికారిక ప్రకటన తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే రఖా అనే ప్రాంతంలో ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. జిహాదీ జాన్ ఒక దేశం అని కాకుండా అన్ని దేశాలకు చెందిన బందీలను పశువులను వధించినట్లు వధించాడు. కువైట్ లోని ఇరాక్ కుటుంబంలో జన్మించిన ఎమ్వాజీ లండన్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పనిచేసి అనంతరం ప్రపంచంలోనే అతి క్రూరమైన ఉగ్రవాదిగా మారాడు.