ట్రంప్, హిల్లరీలో ఎవరు గెలిచినా ఒకటేనా? | US election: is it whose victory | Sakshi
Sakshi News home page

ట్రంప్, హిల్లరీలో ఎవరు గెలిచినా ఒకటేనా?

Published Tue, Nov 8 2016 4:31 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్, హిల్లరీలో ఎవరు గెలిచినా ఒకటేనా? - Sakshi

ట్రంప్, హిల్లరీలో ఎవరు గెలిచినా ఒకటేనా?

న్యూయార్క్‌: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌లో ఎవరు విజయం సాధించినా పేదలు, మధ్య తరగతి వర్గాలకు పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇద్దరూ తమ ఎన్నికల ప్రచారానికి భారీగా విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్థల కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. బడా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలను పరిరక్షించే విధాన నిర్ణయాలనే దేశాధ్యక్షులు అమలు చేయాల్సి ఉంటుంది. ఇతర వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే స్వేచ్ఛ అమెరికా అధ్యక్షులకు పరిమితంగానే ఉంటుంది.

హిల్లరీ క్లింటన్, డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ఈ రోజు వరకు 250 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టారు. అందులో దాదాపు 130 కోట్ల డాలర్లను హిల్లరీ విరాళాల రూపంలో సమీకరించగా, ట్రంప్‌ దాదాపు వందకోట్ల డాలర్లను విరాళాలుగా సేకరించినవే. విరాళాలిచ్చే ముందు కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు అధ్యక్ష అభ్యర్థులతో తమ ప్రయోజనాల గురించి వివరిస్తారు. ఆ ప్రయోజనాలను పరిరక్షించేవారికి ఎక్కువ విరాళాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. ఈ నిర్ణయాలు, సమావేశాలు పార్టీ అభ్యర్థులు, కార్పొరేట్‌ ప్రతినిధుల మధ్య రహస్యంగా జరిగిపోతాయి. ఈసారి కూడా ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. కానీ ఇదంతా పారదర్శకంగా కనిపించడం కోసం విరాళాల దాతలతో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు బహిరంగంగా చర్చా సమావేశాలు నిర్వహిస్తారు.

అమెరికాలో అతిపెద్ద పొగాకు కంపెనీ ఆల్ట్రియా 5,40,000 డాలర్లు, రెండవ పెద్ద పొగాకు కంపెనీ రెనాల్డ్స్‌ అమెరికన్‌ కంపెనీ ఏకంగా 9,90.000 డాలర్లను రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంపకు విరాళంగా ఇచ్చాయి. అమెరికన్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్, అమెరికా పారిశ్రామిక మండలి కూడా ఎన్నికల్లో ట్రంప్‌కు భారీగానే విరాళాలు ఇచ్చాయి. ఇక హిల్లరీకి వైద్య పరికరాల సరఫరా కంపెనీలు, ఎంటర్‌ టైన్‌మెంట్‌ సంస్థలు, విద్యా సంస్థలు, టీచర్ల సంఘాలు, మీడియా గ్రూప్‌లు. హాలివుడ్‌ సినీ పరిశ్రమ వర్గాలు, ఆర్థిక, సామాజిక సమానత్వం కోరుకునే సంస్థలు, కార్మిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎక్కువగా విరాళాలు ఇచ్చారు.

కొన్ని కంపెనీలు ఎందుకైనా మంచిదని ఇద్దరు అభ్యర్థులకు విరాళాలు ఇచ్చాయి. అయితే అలాంటి కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. తమకు ఎవరు అనుకూలంగా ఉన్నారనుకున్నారో వారికి ఎక్కువ విరాళాలు ఇచ్చి, ప్రత్యర్థికి తక్కువ విరాళాలు ఇచ్చాయి. తమ యజమానులైన కార్పొరేట్‌ సంస్థలతో పోటీ పడాలంటే కార్మిక సంఘాలు కూడా విరాళాలు ఇచ్చుకోవాల్సిన అవసరం అమెరికాలో ఏర్పడటం విచిత్రం. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలనుకుంటున్న సామాజిక కార్యకర్తలు కూడా అధ్యక్ష ఎన్నికలకు విరాళాలు ఇవ్వడం మరింత ఆశ్చర్యకరం.

అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా పెరిగిపోతోందని, తుపాకులను నియంత్రించాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో అమెరికా గన్‌ అసోసియేషన్‌ (తుపాకీ తయారీ కంపెనీల సంఘం) కూడా అధ్యక్ష ఎన్నికలకు భారీగా విరాళాలు ఇచ్చాయి. కార్పొరేట్‌ సంస్థలు ఒక్క దేశాధ్య ఎన్నికలకే కాకుండా విధాన నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండేలా వివిధ రాష్ట్రాలకు కూడా విరాళాలు ఎప్పటికప్పుడు ఇస్తుంటాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వంత చట్టాలను కలిగిఉండే స్వేచ్ఛ ఉండడంతో అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసేందుకు కార్పొరేట్‌ సంస్థలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. విరాళాలు, లాబీయింగ్‌ ప్రభావం విధాన నిర్ణయాలపై ఎలాంటి ఉంటుందో రాష్ట్ర చట్టాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

 అమెరికా రాష్ట్రాలు చట్టాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజల ఓటింగ్‌ను నిర్వహిస్తుంటాయి. ఒహాయోలో ఏడాదిక్రితం కార్మికుల కనీస వేతనాలపై ఓటింగ్‌ నిర్వహించారు. ఆ చట్టం కఠినంగా ఉండకుండా ఉండేందుకు కార్పొరేట్‌ సంస్థలు ఆ రాష్ట్ర ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ (రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తర్వాతి పోస్ట్, భారత్‌లోని చీఫ్‌ సెక్రటరీ లాంటి పోస్ట్‌)అధికారితో భారీగా లాబీయింగ్‌ జరిపాయి. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ను కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నుకుంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ల్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నియమిస్తారు. వీరికి పదోన్నతి వస్తే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు అవుతారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఫైల్‌ ఈ అధికారుల ఆధీనంలోనే ఉంటుంది.

నేవడా రాష్ట్రంలో తుపాకీ నియంత్రణా చట్టాన్ని మరింత కఠినంతరం చేయాలన్న ప్రతిపాదన ప్రజల నుంచి వచ్చింది. దీనిపై ఓటింగ్‌ నిర్వహించి చట్టంలో మార్పులు తీసుకరావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఓటింగ్‌కు బిల్లును రూపొందించాల్సిన బాధ్యతు ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ కావడంతో ఆ బాధ్యత సదరు వ్యక్తికి అప్పగించారు. చట్టం కఠినమైతే తుపాకులు అమ్ముకోవడం కష్టమవుతుందని భావించినా గన్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌తో లాబీయింగ్‌ జరిపింది.

తుపాకీని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసేటప్పుటు ఆ తుపాకీని తీసుకొనే వ్యక్తి నేర చరిత్రను సమగ్రంగా తనిఖీ చేయాలంటూ ప్రతిపాదన తయారైంది. వాస్తవానికి ఏ వ్యక్తికైనా తుపాకీ అమ్మేటప్పుడు ఆ వ్యక్తి నేరచరిత్రతోపాటు ప్రవర్తన తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలనే ప్రతిపాదన చట్టంలో తీసుకరావాల్సి ఉండింది. కంపెనీల లాబీయింగ్‌తో చట్టం సవరణ ప్రతిపాదన  రూపమే మారిపోయింది. వచ్చే నెలలో ఈ ప్రతిపాదనపై ఓటింగ్‌ జరుగనుంది.

‘ది కీ టు ఎనీ బ్యాలెట్‌ మెజర్‌ ఈజ్‌ రైట్‌ లాంగ్వేజ్, కంపెనీ గీవ్స్‌ ది కాన్సెప్ట్, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రైట్స్‌ ది లాంగ్వేజ్‌’ అని వాల్‌మార్ట్, ఫిలిప్‌ మోరిస్, ఇంటర్నేషనల్‌ విన్‌ రిసార్ట్స్‌ లాంటి పెద్ద సంస్థలను కస్టమర్లుగా కలిగిన అమెరికాలోని లింకన్‌ స్టాటజీ గ్రూప్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ నాథన్‌ స్ప్రౌల్‌ ఓ రహస్య సమావేశంలో చేసిన వ్యాఖ్య రాజకీయ నాయకులకు, కార్పొరేట్‌ సంస్థలకు ఎలాంటి అనుబంధం ఉంటుందో తెలియజేస్తోంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచారా, హిల్లరీ గెలిచారా అన్నది ముఖ్యం కాదు. వారికి విరాళాలు ఎలాంటి సంస్థలు, ఎలాంటి కంపెనీలు విరాళాలు ఇచ్చాయన్నది ముఖ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement