జర్నలిస్టులపై చెయ్యి చేసుకున్న ట్రంప్ అనుచరులు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షరేసు బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇన్నాళ్లు తమ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్.. తాజాగా జర్నలిస్టులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పెనిస్విలేనియాలో ట్రంప్ నిర్వహించిన ఓ ఈవెంట్లో దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగించిన అనంతరం.. మీడియా ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. జాతీయ మీడియా ఎన్డీటీవీ ప్రతినిధి కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
జర్నలిస్టులతో మాట్లాడటం తనకు ఇష్టం లేదని, మీరు అబద్ధాలకోరులని ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఆయన అనుచరులు ఏకంగా కొందరు జర్నలిస్టులను నెట్టివేస్తూ వారిపై చెయ్యి చేసుకున్నారు. మీ చేతిలో ఉన్న మైక్స్ కింద పడేస్తాను అంటూ ట్రంప్ మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అసలు మీరు ఎవరో తెలియదు, ఇక్కడి ఎందుకు వచ్చారంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. గతంలోనూ న్యూయార్క్ టైమ్స్, బజ్ ఫీడ్, పోలిటికో, వాషింగ్టన్ మీడియా సంస్థలపై నోరు పారేసుకున్నారు.
గత ఆగస్టులో ఓ ర్యాలిలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను వంకర బుద్ధిగల హిల్లరీపై పోరాటం చేయలేదని, వంకర బుద్ధిగల మీడియాపై పోరాటం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా కేవలం హిల్లరీకి మద్ధతుగా ప్రచారం నిర్వహిస్తోందని, అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరుగుతుందని ట్రంప్ ఎన్నో ఆరోపణలు చేశారు. మొత్తం మూడు ఢిబేట్లలోనూ హిల్లరీనే ఆదిపత్యం ప్రదర్శించారు. దాంతో ట్రంప్ తన ఆవేశాన్ని మీడియాపై ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.