
'నా దేశ పౌరులారా..! జర జాగ్రత్త'
వాషింగ్టన్: ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అమెరికా తన దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ పర్యటనలకు వెళ్లే అమెరికా పౌరులారా తస్మాత్ జాగ్రత్త అంటూ అప్రమత్తతను(ట్రావెల్ అలర్ట్) గుర్తు చేసింది. ఇటీవల పారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో ప్రపంచమంతటా ఒక్కసారిగా ఉలిక్కి పడిన విషయం తెలిసిందే. అగ్ర రాజ్యాలన్నీ కూడా వణికిపోయాయి. ఈ దాడుల అనంతరం అమెరికాపై దాడులు చేస్తామని ప్రపంచమంతటా ఏదో ఒక దేశంపై ఊహించని సమయాల్లో దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా తమ పౌరులను హెచ్చరించింది.
'ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇస్లామిక్ స్టేట్, అల్ ఖాయిదా, బోకోహారమ్, ఇతర ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోని పలు దేశాల్లో దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి' అని అమెరికా ప్రభుత్వం తన వెబ్ సైట్ లో పౌరులకు తెలియజేసింది. దాడులు ఆయుధాలతోని ఉండవచ్చని, భౌతిక అభౌతిక రూపంలో దాడులు ఉండొచ్చని హెచ్చరించింది. అందుకే ఎటైనా వెళ్లే ముందు దేశ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు దృష్టిలో పెట్టుకోవాలని, చుట్టుపక్కల గమనిస్తూ ఉండాలని, ముఖ్యంగా సెలవుల సమయాల్లో, సమూహాల మధ్యన ఉన్నప్పుడు అప్రమత్తతో ఉండాలని హెచ్చరించింది. ఇస్లామిక స్టేట్ అమెరికాలోని వౌట్ హౌస్ పై కూడా దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా విడుదల చేసిన ఈ ట్రావెలర్ అలర్ట్ వచ్చే ఫిబ్రవరి 24న ముగియనుంది.