ఎట్టి పరిస్థితుల్లో ఆ హోటల్‌కు వెళ్లకండి!
- పాక్‌లోని తమ పౌరులకు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్‌లో ఉన్న తమ పౌరులకు అమెరికా ఎన్నడూలేని రీతిలో చాలా కచ్చితమైన హెచ్చరికలు చేసింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న మారియట్ హోటల్‌కు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దని సూచించింది. ఈ మేరకు తమ దేశ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వయిజరీని అమెరికా విదేశాంగ శాఖ జారీచేసింది.
ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌కు పెద్ద ముప్పే పొంచి ఉన్నట్టు అక్కడి తమ రాయబార కార్యాలయానికి సమాచారముందని తెలిపింది. 'రానున్న కొన్ని రోజులపాటు ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లరాదని అమెరికా పౌరులకు చాలా కచ్చితమైన సలహా ఇస్తున్నాం' అని విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్‌లో నెలకొన్న భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ దేశానికి వెళ్లే అనవసరమైన పర్యటనలన్నింటీని వాయిదా వేసుకోవాలని అమెరికా తన పౌరులను కోరింది.
పాకిస్థాన్‌లో ఇటీవల ఉగ్రవాద హింస పెచ్చు మీరుతున్న సంగతి తెలిసిందే. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో అమెరికన్లతోపాటు విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 16న ఓ అమెరికా విద్యావేత్తను పాక్‌లో మోటారు బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు.