భారత్‌లోని వ్యభిచార కూపాల్లో లక్షలాది మంది బాధితులు
అమెరికా నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: భారతదేశంలో లక్షలాది మంది మహిళలు, పిల్లల్ని బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి దింపుతున్నారని అమెరికాకు చెందిన స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ కనీస నిబంధనలు అమలు చేయలేకపోతుందని, ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని తన నివేదికలో పేర్కొంది. ‘మానవుల అక్రమరవాణా నివేదిక 2016’లో భారత్‌ను టైర్-2 జాబితాలో స్టేట్ డిపార్ట్‌మెంట్ పొందుపర్చింది. ఈ జాబితాలో టైర్-1 సురక్షిత దేశాలు కాగా, టైర్-3 దేశాలు ప్రమాదకరమైనవి.
భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్, శ్రీలంకలు కూడా టైర్-2 జాబితాలోనే ఉన్నాయి. ఏదైనా దేశం రెండేళ్ల పాటు టైర్-2 జాబితాలో ఉంటే దాన్ని టైర్-3లోకి చేర్చుతారు. భారత్‌లో పురుషులు, మహిళలు, చిన్నారులచే అక్రమంగా పనులు చేయించడంతో పాటు మహిళలు, చిన్నారుల్ని వ్యభిచారంలోకి దింపుతున్నారని నివేదిక వెల్లడి ంచింది. వీటి నివారణ కోసం న్యాయ విచారణ, శిక్షల్ని సమర్ధంగా అమలుచేయాలని భారత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మానవుల అక్రమ రవాణా భారత్‌లో అతి పెద్ద సమస్యగా మారిందని, పూర్వీకులు చేసిన అప్పుల కోసం వెట్టి చాకిరీ చేయాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది.