భారతీయులకు ‘గ్లోబల్‌ ఎంట్రీ’ | US rolls out expedited entry for 'low-risk' Indian travellers | Sakshi
Sakshi News home page

భారతీయులకు ‘గ్లోబల్‌ ఎంట్రీ’

Published Mon, Jul 10 2017 12:22 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

భారతీయులకు ‘గ్లోబల్‌ ఎంట్రీ’ - Sakshi

భారతీయులకు ‘గ్లోబల్‌ ఎంట్రీ’

ఎక్కువ తనిఖీలు లేకుండానే అమెరికాలోకి ప్రవేశం
ఇతర దేశాల పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా తేలికగా అమెరికాలోకి అడుగుపెట్టడానికి అనుమతించే ‘గ్లోబల్‌ ఎంట్రీ’ అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్టు అమెరికా ఇటీవల ప్రకటించింది. ముందే అనుమతి పొందిన, ముప్పు కలిగించే అవకాశం లేని ప్రయాణికులు సులువుగా అమెరికాలో ప్రవేశించడానికి వీలుగా కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం (సీబీపీ) గ్లోబల్‌ ఎంట్రీని గతంలో రూపొందించింది.

అమెరికా హోం లాండ్‌ సెక్యూరిటీ శాఖలో భాగమైన సీబీపీ తాజా నిర్ణయం ఫలితంగా ఇక నుంచి భారతీయులు గ్లోబల్‌ ఎంట్రీ సౌకర్యం కోసం గ్లోబల్‌ ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సిస్టం(గోస్‌) వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా నిర్ణయంతో గ్లోబల్‌ ఎంట్రీ అవకాశం లభించిన పదకొండో దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న నవతేజ్‌సింగ్‌ సర్నా ఈ విధానంలో పేరు నమోదు చేయించుకున్న తొలి భారతీయుడయ్యారు.

విమానాశ్రయాల్లో ఇబ్బందులుండవు!
ఇప్పటికే అమెరికాతోపాటు 10 ఇతర దేశాలకు చెందిన 40 లక్షల మంది గ్లోబల్‌ ఎంట్రీ సభ్యులుగా చేరారు. అమెరికా విమానాశ్రయాల్లో వారు సంప్రదాయ సీపీబీ తనిఖీ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆటోమేటెడ్‌ కియోస్క్‌(గది)కు వెళ్లి తమ గుర్తింపు కార్డులను నిమిషాల్లో తనిఖీ చేయించుకుని అమెరికా నగరాల్లోకి ప్రవేశించవచ్చు.

గ్లోబల్‌ ఎంట్రీ సభ్యులు అమెరికా రవాణా భద్రత విభాగం అందించే ప్రత్యేక స్క్రీనింగ్‌ సౌకర్యం కూడా పొందవచ్చు. అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న అర్జెంటీనా, కొలంబియా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటన్‌ దేశాల పౌరులకు ఇప్పటికే గ్లోబల్‌ ఎంట్రీ అర్హతకు అనుమతి ఇచ్చారు. తాజాగా భారత్‌ ఈ జాబితాలో చేరింది. 11 దేశాలతోపాటు అమెరికా పౌరులు, జాతీయులు, చట్టబద్ధమైన శాశ్వత వాసులు కూడా గ్లోబల్‌ ఎంట్రీలో సభ్యత్వం తీసుకోవడానికి అర్హులే. అలాగే, నెక్సస్‌ ప్రోగ్రాంలో నమోదైన కెనడా పౌరులు, నివాసులు కూడా గ్లోబల్‌ ఎంట్రీకి దరఖాస్తుచేసుకోవచ్చు.

53 ఎయిర్‌పోర్టుల్లో సౌకర్యం
ప్రస్తుతం 53 అమెరికా విమానాశ్రయాల్లో ఈ గ్లోబల్‌ ఎంట్రీ ఆటోమేటెడ్‌ కియోస్క్‌లు పనిచేస్తున్నాయి. ఐదేళ్ల గ్లోబల్‌ ఎంట్రీ సభ్యత్వానికి దరఖాస్తు ఫీజు వంద డాలర్లు. ఆన్‌లైన్‌లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. మొదట దరఖాస్తుదారుడి పూర్వపరాలు తనిఖీచేస్తారు. అనంతరం అమెరికా, కెనడా, ఖతార్‌లో ఉన్న వందకు పైగా నమోదు కేంద్రాల్లో ఒక చోట దరఖాస్తుదారుడిని సీబీపీ అధికారి ఒకరు ఇంటర్వ్యూ చేసి సభ్యత్వంపై తుది నిర్ణయం తీసుకుంటారు. గ్లోబల్‌ ఎంట్రీ నియమాలు, షరతులు ఉల్లంఘించినవారి సభ్యత్వం రద్దుచేస్తారు. అమెరికాలోకి ఉగ్రవాదులు, వారు ఉపయోగించే ఆయుధాలు రాకుండా చూడడం గ్లోబల్‌ ఎంట్రీ ఉద్దేశం. దీని అమలు బాధ్యత సీబీపీదే.

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement