
న్యూఢిల్లీ : ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడి నుంచే వచ్చి పాలు తాగిపోతుందీ పాడు పిల్లి అని భారతీయులు సహజంగా అసహించుకుంటారు. కానీ ప్రాణాలు కాపాడే పిల్లులంటూ ప్రేమిస్తారు పాశ్చాత్యులు. వారి నమ్మకాన్ని అక్షరాల రుజువు చేసింది కొలంబియాలో ఓ పిల్లి, ఏడాది బాబును ప్రాణాపాయం నుంచి రక్షించి హీరోగా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. డయానా లోరెనా అల్వరేజ్ అనే తల్లి మెట్ల పైనున్న గదిలో వున్న తన బాబును చూడడం కోసం వెళ్లింది. తొట్టెలో ఉండాల్సిన బాబు బయటకు ఎలా వచ్చాడబ్బా అంటూ ఆశ్చర్యపోయింది.
తొట్టెలో నుంచి బాబు ఎలా దిగాడో చూడడం కోసం గదిలోని సీసీటీవీ ఫుటేజ్ చూడగా, తొట్టెలో నుంచి బాబు ఎలా దిగాడన్న దానికంటే ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించి అవాక్కయింది. ఎలాగో తొట్టెను దిగిన బాబు, అక్కడే కుర్చీలో ఉన్న పిల్లితో పోటీగా అన్నట్లుగా గబాగబా పాక్కుంటూ మెట్లవైపు దూసుకుపోయాడు. గది అంచుకు చేరి మెట్ల మీదుగా పడిపోబోతున్నట్లు కనిపించాడు. అంతే, ఆ దృశ్యాన్ని చూసిన పిల్లి శర వేగంతో రాకెట్‌లా దుసుకెళ్లి, తన భుజాన్ని, ముందు కాళ్లను ఉపయోగించి బాబును పడిపోకుండా గదిలోపలికి తోసింది. ఈ వీడియో క్లిప్పింగ్‌ను డయానా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. చూసిన వారంతా పిల్లి చేష్టను పెద్ద చేష్టగా ప్రశంసిస్తున్నారు. చిన్నారిని చాకచక్యంగా కాపాడిన ఆ మార్జాలం పేరు ‘గాటుబెలా’..
Comments
Please login to add a commentAdd a comment