అది మామూలు అరటి పండు. కానీ ఖరీదు మాత్రం సాధారణంగా లేదు. ఇటలీలోని మియామి బీచ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టిన ఓ అరటిపండు ఏకంగా రూ.85 లక్షలు పలికింది. దీన్ని మౌరిజియా కాటెలాన్ అనే కళాకారుడు ప్రదర్శనకు పెట్టగా ఎంతోమంది దాన్ని కొనలేకపోయామని నిరాశ చెందుతూ దానిముందు నిల్చుని ఫొటోలు తీసుకుని సంతృప్తి చెందుతున్నారు. ఎవరు కొన్నారో కానీ అతను సూపర్ హీరో అంటూ నెటిజన్లు ఆయన్ను ఆకాశానికి ఎత్తారు. అయితే అంతలోనే ఈ అరటి పండు కథ అనూహ్య మలుపు తిరిగింది. డేవిడ్ దతున అనే వ్యక్తికి అరటిపండును చూడగానే ఆకలైందో ఏమో గానీ, వెంటనే లటుక్కున నోట్లో వేసుకున్నాడు.
అతను చేసిన పనికి అక్కడి జనం నోరెళ్లబెట్టారు. ఓ యువతైతే అతని మీద అరిచినంత పని చేసింది. ‘ఏంటీ, తెలివితక్కువ పని’ అంటూ ఆయనపై ఆగ్రహం వెళ్లగక్కింది. ఊహించని పరిణామానికి అధికారులకు సైతం నోటమాటరాలేదు. ‘ఆకలి గొన్న కళాకారుడు.. అది నేనే’ అంటూ డేవిడ్ తను చేసిన ఘనకార్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షలు విలువచేసిన అరటిపండును అప్పనంగా తిన్న డేవిడ్ రియల్ హీరో అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ఒక్క అరటిపండు డేవిడ్‌ను జనాల ముందు హీరోను చేస్తే అధికారుల ముందు దోషిగా నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment