
దుబాయ్: ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకు తరలించే విషయంలో జరుగుతున్న ఆలస్యంపై దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి నిస్సహాయత వ్యక్తం చేశారు. పార్థీవదేహాన్ని అప్పగించే వరకు ఏమీ చేయలేమని ఆయన అన్నారు. వీలైనంత తొందరగా శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశం తరలించేందుకు దుబాయ్ ప్రభుత్వ యంత్రాంగంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.
వదంతులు వద్దు
శ్రీదేవి లాంటి సెలబ్రిటీ చనిపోయినప్పుడు మీడియాకు ఆసక్తి సహజమని, వదంతులు వ్యాపింపజేయడం ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని.. వారి బాధను పంచుకుంటున్నామని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఈలాంటి కేసుల్లో చట్టప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయడానికి రెండుమూడు రోజులు పడుతుందన్నారు. శ్రీదేవి ఎలా చనిపోయిందనేది నిపుణులు తేలుస్తారని చెప్పారు.
రీపోస్టుమార్టంకు అవకాశం?
శ్రీదేవి భౌతికకాయానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకపోలేదని తెలుగు మహిళా న్యాయవాది అనురాధ వొబ్బిలిశెట్టి తెలిపారు. ప్రవాసుల సహజ, అసహజ మరణాల్లో న్యాయప్రక్రియ అందరికీ ఒకేలా ఉంటుందన్నారు. లోతుగా దర్యాప్తు అవసమని భావిస్తే రీపోస్టుమార్టంకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశిస్తుందని చెప్పారు. అనుమానాలు నివృత్తి కాకుండా భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒప్పుకోదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment