అమెరికాలో ఏవి ఖరీదు, ఏవీ చౌక
ప్రస్తుత ప్రపంచంలో ఏ మనిషికైనా కనీస అవసరాలు ఏముంటాయి? తిండి, ఇల్లు, వైద్యం, విద్య.. ఇవేకదా! మరి ఇలాంటి కనీస అవసరాల ధరలు కొండెక్కి కూర్చున్నవేళ.. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఆటబొమ్మల లాంటి అదనపు అవసరాల ధరలు అతి తక్కువగా ఉన్నాయంటే ఆ ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదనుకోవాలి? అమెరికాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. కనీస అవసరాలు పొందాలంటే అక్కడి ప్రజలు డాలర్లు కుమ్మరించాల్సి వస్తోంది. అదే లగ్జరీ వస్తువులు మాత్రం డెడ్చీప్గా దొరుకుతున్నాయి.
అమెరికాలో ఏ వస్తువులు చౌక? ఏ వస్తువులు ఖరీదు? అనే విషయంపై ప్రముఖ సామాజికవేత్త, క్వీన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసఫ్ కొహెన్ వెల్లడించిన అభిప్రాయానికి రుజువులుగా అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఆర్థిక శాస్త్రవేత్త మార్క్ పెర్రీ మరింత సమాచారాన్ని క్రోడీకరించారు. 1996 నుంచి పెరుగుతున్న వివిధ సరుకులు, వస్తువుల ధరల సరళిని పెర్రీ ఇలా వివరించారు..
1996 నుంచి ఇప్పటివరకు అమెరికాలో ఆహార పదార్థాలు, ఇళ్ల ధరలు 60 శాతం పెరగ్గా, వైద్య సౌకర్యాలు రెండు రెట్లు, ఉన్నత విద్య, పిల్లల పుస్తకాల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఈ పెరుగుదల దేశ ద్రవ్యోల్బణం పెరుగుదల కన్నా వేగంగా ఉంది. మరోపక్క మొబైల్ ఫోన్ సర్వీసులు, సాఫ్ట్‌వేర్, టీవీలు, బొమ్మల ధరలు రాకెట్ వేగంతో పడిపోతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే సగటు అమెరికన్ పౌరులు టీవీలను సులభంగానే కొనగలుగుతున్నారు. బతకడానికి అవసరమైన ఆహార పదార్థాలను, వైద్య సౌకర్యాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది?
ఫ్యాక్టరీలు ఉత్పత్తిచేసే వస్తువుల ధరలే దశాబ్దాల కాలంగా పడిపోతున్నాయని, అందుకు సాంకేతిక రంగంలో రోజురోజుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడటమే కారణమని మార్క్ పెర్రీ తెలిపారు. ఆహార దినుసుల ఉత్పత్తిలోనూ, వైద్య సౌకర్యాలను కల్పించడంలో అంతగా అంతర్జాతీయ పోటీ లేదని ఆయన చెప్పారు. వైద్య సౌకర్యాలకు ఎక్కువగా బీమా సౌకర్యాలు అందుబాటులో ఉండటం కూడా పోటీతత్వం పెరగకపోవడానికి ఒక కారణమని ఆయన అన్నారు.
ఇక అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత విద్యారంగానికి వస్తే ప్రపంచపోటీ తక్కువేనని కూడా పెర్రీ తెలిపారు. పైగా ఇక్కడి విద్యార్థులకు రుణ సౌకర్యం ఎక్కువ లభించడం కూడా విద్యను ఖరీదుగా చేస్తోందని ఆయన అన్నారు. రుణసౌకర్యం ఎక్కువగా లభించే రంగాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం ఒక్కో విద్యార్థి 1.20,000 డాలర్ల చొప్పున మొత్తం విద్యార్థులు 13వేల కోట్ల డాలర్లు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. ఈ ట్రెండ్‌ను సామాజిక కోణంలో విశ్లేషిస్తే.. ప్రజలు తమకు అవసరమైన సరకులను కొనలేరని, అవసరం లేని సరకులను కొనగలరని చెప్పారు.