ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేస్తే.... | what happens people leaves eating meat in world | Sakshi
Sakshi News home page

ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేస్తే....

Published Wed, Feb 15 2017 6:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేస్తే....

ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేస్తే....

లండన్‌: మాంసాహారానికి స్వస్తి చెప్పి శాకాహారాన్ని ఆశ్రయించాలని ప్రపంచవ్యాప్తంగా విజిటేరియన్లు ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. అందరూ శాకాహారాన్ని ఆశ్రయించడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్న కొత్త వాదన కూడా శాకాహార ప్రోత్సహానికి దోహద పడుతోంది. ఈ మేరకు ప్రపంచమంతా మాంసాహారానికి స్వస్తి చెబితే ఏమవుతుంది?

పళ్లు, కూరగాయల పెంపకం వల్ల వాతావరణంలో కలిసే కార్బన్‌డయాక్సైడ్‌ కన్నా కోళ్లు, మేకలు, ఆవులు, పందుల మాంసం వల్ల ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలో కలుస్తోంది. 226 గ్రాముల బంగాళ దుంపలు విడుదలచేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 0.2 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానం. అదే 226 గ్రాముల ఆవు మాంసం విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 12.7 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానమని ‘సైంటిఫిక్‌ అమెరికన్‌’ పత్రిక వెల్లడించింది.

ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి మారితే పర్యావరణంలో కర్బన ఉద్గారాలు మూడింట రెండు వంతులు తగ్గుతాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలోని ఆక్స్‌ఫర్డ్‌ మార్టిన్‌ స్కూల్‌ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. మాంసాహారాన్ని వదులుకోవడం వల్ల అపారంగా నీటి వనరులు కూడా మిగులుతాయి. చెరకు, కూరగాయలు, పళ్లు, పప్పు దినుసులు పండించడం కన్నా కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవుల పెంపకానికి ఎక్కువ నీటి వనరులు అవసరమవుతాయి. అన్నింటి కన్నా ఆవులకు ఎక్కువ నీరు అవసరం. శాకాహారం  ఫలితంగా ప్రపంచమంతా పచ్చదనం అలుముకుంటుందని, పర్యావరణంతోపాటు మానవుల ఆరోగ్యం కూడా బాగుపడుతుందన్నది ఈ పరిశోధనల సారాంశం.


మాంసాహారానికి స్వస్తి చెప్పడం వల్ల లాభాలే తప్ప నష్టాలే లేవా? ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 400 కోట్ల నెమరువేసే జంతువులను, లక్షలాది కోట్ల కోళ్లను మాంసం కోసం పోషిస్తున్నారు. వీటికి స్వస్తి చెప్పడం వల్లన జీవవైవిద్యం దెబ్బతింటుంది. పేదలకు పౌష్టికాహారం మాంసం రూపంలోనే ఎక్కువగా దొరకుతుంది. అది వారికి దూరమైతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

మరో పక్క  ప్రపంచంలో మాంసాహారంపై ఆధారపడి కోట్లాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. మాంసాహారానికి స్వస్తి చెబితే వారంతా ఒక్కసారిగా రోడ్డున పడడమే కాకుండా కొన్ని జాతుల ప్రజల సంస్కతి, సంప్రదాయాలు కూడా దెబ్బతింటాయని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఓ అధ్యయనంలో తెలిపింది. నిరుద్యోగ సమస్య పెరిగి ప్రజల మధ్య అసమానతలు పెరుగుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు కూడా పెరుగుతాయని యూనివర్శిటీ అందులో హెచ్చరించింది.

పలు ప్రాణాధార ఔషధాల్లో జంతు ఉత్పత్తులను వాడుతున్నారు. వాటికి కూడా స్పస్తి చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారం గురించి ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తున్న మాంసాహారం మానేసే వారు తక్కువే ఉన్నారు. కనుక ఇప్పట్లో మాంసాహారాలకు వచ్చే ముప్పేమి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement