ఐఫోన్ యూజర్లకు వాట్సప్ కొత్త ఆప్షన్లు!
న్యూ ఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఆప్షన్లతో ముందుకొచ్చింది. ఇక మీదట ఐఫోన్ యూజర్లకు వారు కోరుకున్న చాట్ మెంబర్ లేదా గ్రూపు నుంచి వచ్చిన ఫోటోలు, వీడియోలను ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ చేసుకునే అవకాశం ఈ కొత్త ఆప్షన్లో వాట్సప్ అందిస్తోంది. అంతేకాకుండా యూజర్లకు 'నెవర్' ఆప్షన్ను కూడా కొత్తగా కల్పిస్తున్నారు. దీని ద్వారా మీడియాలో సేవ్ అవ్వాల్సిన అవసరం లేదని భావించిన ఫైళ్లను వదిలేయొచ్చు.
చాటింగ్ సమయంలో యూజర్లకు ఇన్కమింగ్ మెసేజ్ల నోటిఫికేషన్లను చూపించే కొత్త సదుపాయం సైతం కల్పిస్తోంది. దీని ద్వారా యూజర్లకు త్వరగా స్పందించే వెసులుబాటు కలుగుతుంది. చాటింగ్ సమయంలో మిస్డ్ కాల్ నోటిఫికేషన్ను చూపించే సౌకర్యం కూడా ఐఫోన్ యూజర్లకు వాట్సప్ కల్పిస్తుంది.
ఈ ఫీచర్లను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం కల్పించనున్నట్లు వాట్సప్ వెల్లడించింది. ఇటీవల ఐఫోన్ యూజర్ల కోసం డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ల నుంచి నేరుగా ఫైళ్లను సెండ్ చేసే అవకాశాన్ని వాట్సప్ కల్పించిన విషయం తెలిసిందే.