రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయా?
కార్టలన్ః యాంత్రీకరణ పలు రకాల ఉద్యోగాలు అంతర్థానమయ్యేలా చేస్తోంది. వీటి ప్రభావం ఉపాధిని భారీగా దెబ్బతీస్తోంది. కంప్యూటరరీకరణ వల్ల ఉపాధి శాతం ఇప్పటికే తగ్గిపోగా.. ఆధునిక రోబోట్లు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే కొనసాగితే వచ్చే 20 ఏళ్ళలో ప్రపంచమే రోబోట్ లా మారిపోతుందేమోనన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇటీవల ఓ ఫుడ్ కంపెనీలో పనికోసం ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇటీవల బ్రిటన్ బార్న్ స్లే లోని కారల్టన్.. ప్రిమియర్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్తగా ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో.. అనేకమంది కార్మికుల ఉపాధిని కొల్లగొట్టింది. ఆ సరికొత్త యంత్రం.. వందలకొద్దీ మిస్టర్ క్లిప్పింగ్ కేక్ లను సునాయాసంగా బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేసేస్తోంది. ఇక్కడ ఈ యంత్రానికి సంబంధించిన అన్ని పనులు ఆపరేషన్ప్ మేనేజర్ డారన్ రైనే చూసుకుంటాడు. పని సరిగా చేయడం లేదు, ప్యాకింగ్ సరిగా లేదు అంటూ కార్మికులపై అరవాల్సిన పని ఇప్పుడతడికి లేదు. పనికోసం అధికశాతం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనేక చేతులున్న మనుషుల్లాగా పనిచేసే ఆరోబో... ఎంతోమంది కార్మికులు చేయాల్సిన పనిని స్వయంగా చేసేస్తోంది. ప్రిమియర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొత్తగా ప్రవేశపెట్టిన డజన్లకొద్దీ చేతులున్న ఆ యంత్రం.. సుమారు వెయ్యి కేక్ ముక్కలను కేవలం ఒక్క నిమిషంలోనే ప్యాక్ చేసేస్తుంది. రోబోకి ఏర్పాటు చేసిన కళ్ళు.. కేక్ ఆకారాన్ని గుర్తుపట్టగల్గుతాయి. దీంతో ట్రేలో సర్దుకునే ముందే వాటిలో లోపాలను గుర్తించి, ఏమాత్రం తేడా కనిపించినా వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఈ మిషన్ తో కేవలం ఒక్క నిమిషంలో 1000 వరకూ కేక్ లు ప్యాక్ అయిపోవడం చూసినవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోబోకు ఏర్పాటు చేసిన చేతులు అతి వేగంగా ఒక్కో ముక్కను ఎంచుకోవడం, ట్రేలో పెట్టి నిమిషాల్లో ప్యాక్ చేసేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కార్మికులు కేవలం మిషన్ ను ఆపరేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి మాత్రమే అవసరం అవుతారు. దీంతోపాటు రోబో తీసుకోకుండా వదిలేసిన ముక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించి ఫ్యాక్టరీ ఉద్యోగుల షాప్ కు తరలిస్తారు.
బ్రిటన్ ఫ్యాక్టరీల్లో ఈ ఆటోమేషన్ ఉపయోగం ఇటీవల చాలా మామూలైపోయింది.ఇటువంటి అత్యాధునిక రోబోలు నిజంగా అద్భుతమే అనిపించినప్పటికీ, ఇక్కడ కార్మిక శక్తి తగ్గిపోవడం, ఉపాధి మార్గాలు కరువవ్వడం మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది. చివరికి మనుషులు.. ఫ్యాక్టరీల్లో చెత్తను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది.