జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ విస్తరణపై వివరాలను అందించకుండా చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. ప్రాణాంతక మహమ్మారిపై సమాచారాన్ని చైనాలోని తమ కార్యాలయమే తెలియజేసిందని, చైనా కాదంటూ తాజాగా ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీన వుహాన్ నగరంలో న్యూమోనియా వంటి కేసులు నమోదైన సమయంలో మొదట కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. తాజా ప్రకటనతో సరికొత్త చర్చకు తెరతీసింది.
చైనాను వెనకేసుకొస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో ఈ వారంలో కరోనా వైరస్ గురించి డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన క్రోనాలజీలో తాజా వివరాలను పొందు పర్చింది. వైరల్ న్యుమోనియా కేసులను గుర్తించినట్టు వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్‌సైట్‌లో డిసెంబరు 31న ప్రకటించిన తర్వాత చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయం నుంచి తమకు సమాచారం వచ్చినట్టు పేర్కొంది. అలాగే అదే రోజు, అమెరికాలోని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎపిడిమియోలాజికల్ నిఘా నెట్‌వర్క్ ప్రోమెడ్ సైతం వుహాన్‌లో అంతుచిక్కని కారణాల వల్ల న్యుమోనియా కేసులు బయటపడినట్టు వెల్లడించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కొత్తరకం వైరస్ కేసుల గురించి ఈ ఏడాది జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరితే, జనవరి 3న సమాచారం అందజేశారని వెల్లడించింది. చైనా పట్ల తమకు ఎలాంటి ఆశ్రిత పక్షపాత ధోరణి లేదని మరోసారి స్పష్టం చేసింది.
డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక సంఘటనను అధికారికంగా ధ్రువీకరించడానికి, దాని స్వభావం లేదా కారణం గురించి అదనపు సమాచారాన్ని అందజేయడానికి దేశాలకు 24-48 గంటలు సమయం ఉంటుందన్నారు. తమ నివేదికను ధ్రువీకరించమని కోరిన వెంటనే చైనా అధికారులు డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించారని ర్యాన్ తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓ ఏప్రిల్ 9న పేర్కొన్న వివరాల ప్రకారం.. హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను డిసెంబర్ 31న వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమిషన్ గుర్తించినట్టు తెలిపింది. చైనా నుంచి తొలి నివేదిక వచ్చిందని ఏప్రిల్ 20న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే, ఎవరు తెలియజేశారో మాత్రం డబ్ల్యూహెచ్ఓ పేర్కొనలేదు
కాగా మహమ్మారిని నివారించడానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని, చైనాకు డబ్ల్యూహెచ్ఓ వత్తాసు పలుకుతోందని ట్రంప్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేయడంతోపాటు, సంబంధాలను తెంచుకున్నట్టు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్-19తో ప్రపంచవ్యాప్తంగా 5,21,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment