క్యాష్ ఉన్నా కొనలేరు
(అద్దెకు మాత్రమే ఇవ్వబడును)
పెళ్లి చేసి చూడు... ఇల్లు కట్టి చూడు అని ఓ పాతకాలం సామెత ఉందిలెండి. ఈ హైటెక్ యుగానికి ఇలాంటి సామెతలు అస్సలు పనికిరావు. ఎందుకంటారా? పక్కఫొటోలో చూడండి. మీకే తెలిసిపోతుంది. అమెరికాలోని బ్రూక్లిన్ నగరంలో ఈమధ్యే ఓపెన్ అయిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ఇది. కాకపోతే దీన్ని ఇటుకమీద ఇటుకపేర్చి, రెడీమేడ్ కాంక్రీట్ మిక్స్చర్‌తో పైకప్పు నిర్మించి కట్టలేదు. ఏ ఇల్లయినా ఇలాగే కట్టాలి కదా అనకండి. ‘461 డీన్’ అనే పేరున్న ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను మాత్రం ఇల్లుపై ఇల్లు పెట్టి నిలబెట్టారు. అవునండి... ఇది నిజం. బ్రూక్లిన్ నగరానికి దూరంగా ఉన్న ఓ నౌకాశ్రయంలో ఒక్కో ఇంటిని కట్టి... ఆ తరువాత వీటిని నగరం మధ్యలో బార్క్‌లే సెంటర్ పక్కనే ఉన్న స్థలంలో పేర్చారు. మొత్తం బిల్డింగ్‌లో 60 శాతం ఇలా మాడ్యులర్ పద్ధతిలో ఏర్పాటు చేశారు.
ఫలితంగా భవన నిర్మాణం ద్వారా వెలువడే చెత్త మోతాదు 70 నుంచి 90 శాతం వరకూ తగ్గిపోవడమే కాకుండా ఇంధనం ఖర్చు దాదాపు 67 శాతం వరకూ తగ్గిందని ఈ భవనాన్ని డిజైన్ చేసిన షాప్ ఆర్కిటెక్ట్స్ సంస్థ అంటోంది. మొత్తం 363 అపార్ట్‌మెంట్లు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో స్టూడియో అపార్ట్‌మెంట్లు మొదలుకొని 2 బెడ్‌రూమ్ వరకూ వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉండటం విశేషం. స్టూడియో అపార్ట్‌మెంట్ 740 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ పైభాగంలో క్లబ్‌హౌస్‌తోపాటు ఇండోర్ గేమ్స్, పార్టీ రూమ్ తదితర ఏర్పాట్లు ఉన్నాయి. ఇంటి లోపలి ఫర్నిచర్, కిచెన్ లోపలి కౌంటర్ టాప్ దాదాపు అన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్.
దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో 32 అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి ఎత్తయిన మాడ్యులర్ భవనంగా రికార్డు సృష్టించింది. ఇంకో విశేషం ఏమిటంటే... ఈ అపార్ట్‌మెంట్లు ఏవీ అమ్మకానికి లేవు. అన్నింటినీ అద్దెకు మాత్రమే ఇస్తారు. ఇటీవల దీనికోసం లాటరీ నిర్వహించారు కూడా. మొత్తం 130 స్టూడియో అపార్ట్‌మెంట్లను అద్దెకు పొందేందుకు 84 వేల మంది దరఖాస్తు చేశారు. ఒక్క స్టూడియో అపార్ట్‌మెంట్ అద్దె ఎంతో తెలుసా? నెలకు 2450 డాలర్లు! సుమారు లక్షా 66 వేల 700 రూపాయలు.