న్యూయార్క్: సాధారణంగా పాశ్చాత్య దేశాలంటే బంధాలు, భావోద్వేగాలు చాలా తక్కువని అంటుంటారు. విడిపోవడం దూరంగా ఉండటం షరామాములే అని చెబుతుంటారు. కానీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని ఎమోషన్స్‌లో కూడా వారు తక్కువేం కాదని తెలిసింది. ఓ సెంటిమెంట్ సీన్ సమయంలో నేపథ్య సంగీతం వస్తూ ప్రేక్షకులను సీట్లో ఎలా కట్టిపడేస్తుందో అలాంటి సంగీతం అక్కడ లేకపోయినా అదే అనుభూతినిచ్చేలా అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో అద్భుతమైన దృశ్యాలు గుండెను తట్టి లేపాయి.
దాదాపు వారం రోజుల తర్వాత తమవారిని తిరిగి కలుసుకుంటున్న తరుణంగా ఏర్పడిన భావోద్వేగ సన్నివేశాలు కోకొల్లలుగా దర్శనం ఇచ్చాయి. భార్యకోసం భర్త, తల్లిదండ్రుల కోసం పిల్లలు, తమ బంధువుల కోసం అయినవారి ముఖాలు ఒక్కసారిగా విచ్చిన మొగ్గల్లా మారిపోయాయి. అమాంతం ఆనంద భాష్పాలతో ఆలింగనం చేసుకుంటుండగా చూస్తున్నవారంతా వావ్ అంటూ కేకలు పెడుతూ చప్పట్లతో అభినందిస్తూ వారు కూడా భావోద్వేగాలకు లోనయ్యారు. ఉదాహరణకు ‘డల్లాస్‌కు చెందిన అహ్మద్ అబ్దుల్లా సోమాలియా సంతతికి చెందిన అమెరికన్. ఆయన గత నాలుగు రోజులుగా తన భార్యకోసం ఎదురుచూస్తున్నాడు. ఏడు ముస్లిందేశాల ట్రావెలింగ్ వీసాలపై ట్రంప్ నిషేధం విధించిన నేపథ్యంలో అతడి భార్య దుబాయ్‌కు వెళ్లి అక్కడే ఉండిపోయింది.
తిరిగి ఇటు వచ్చే క్రమంలో అక్కడే గ్రీన్ కార్డు తీసుకోవడంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో పిల్లలతో సహా నిలిచిపోయింది. దీంతో ఇక తాము కలవగలమా అని ఎదురుచూస్తున్న అతడికి ఇటీవల అమెరికా కోర్టు ట్రంప్ నిబంధనలు చెల్లవని చెప్పిన నేపథ్యంలో ఆశలు చిగురించాయి. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికా నిరభ్యంతరంగా రావొచ్చని చెప్పిన నేపథ్యంలో అతడి భార్య దుబాయ్ నుంచి బయలు దేరి రావడంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
అలాగే, కావేహ్ యూసెఫీ అనే యువకుడి తల్లిదండ్రులు ఇరాన్ నుంచి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అతడు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాడు. వీసా నిబంధనలు పక్కకుపోయిన నేపథ్యంలో వారు తిరిగి అమెరికా రావడంతో వీల్ చైర్‌లో ఉన్న తల్లిని చూసి ఆ కుమారుడు మురిసిపోయాడు. ఇలా ఒక్కటేమిటి దాదాపు అన్ని అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఇలాంటి దృశ్యాలే కనువిందు చేశాయి.
సంబంధిత వార్తలకై ఇక్కడ చదవండి
(ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!)
(‘నిషేధం’పై వెనక్కి!)
(డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!)
(ట్రంప్కు మరో గట్టి ఎదురు దెబ్బ!)