భర్త లేకుండా బయటకు వచ్చిందని..
కాబుల్: మహిళలపై తాలిబన్ల అఘాయిత్యాలు అఫ్గనిస్తాన్లో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భర్త లేకుండా తమ గ్రామంలోకి ప్రవేశించిన ఓ మహిళను తాలిబన్లు అతికిరాతకంగా చంపారు. ఏకంగా మహిళ తలను మొండెం నుంచి వేరు చేసి తమ కర్కషత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఈ సంఘటన సర్ ఈ పుల్ ప్రావిన్స్లోని తాలిబన్ల పాలనలో ఉన్న లట్టి గ్రామంలో చోటు చేసుకుంది.
భర్త ఇరాన్లో ఉండటంతో మార్కెట్లో షాపింగ్ చేయడానికి లట్టి గ్రామానికి బాధిత మహిళ వచ్చిందని సర్ ఈ పుల్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. భర్త లేకుండా వచ్చినందుకు గానూ ఆమెను తాలిబన్లు హత్య చేసినట్టు పేర్కొంది.
తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఇస్లాం పేరుతో నిబంధనలను తాలిబన్లు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పురుషుల సహాయం లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావడం నిషేధం. చదువు, ఉద్యోగాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. బురఖా తప్పని సరిగా ధరించాలి.
ఇటీవలే భద్రతాదళాల్లో పని చేస్తున్న ఐదుగురు మహిళలు ఉద్యోగానికి వేళ్తుండగా తాలిబన్లు తుపాకులతో కాల్చి చంపారు. 2001లో తాలిబన్ల ప్రాబల్యం తగ్గినప్పటినుంచి మహిళల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.విద్యా, ఉపాధిలో అఫ్గన్ మహిళలు కొంత మేర విజయం సాధించినా తాలిబన్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.