నాడు భర్తను 25అంతస్తుల నుంచి తోసి..
ఓక్లాహామా: భర్తను హత్య చేసి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న అంబర్ హిల్బర్లింగ్ అనే మహిళ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాను శిక్ష అనుభవిస్తున్న సెల్ లోపల ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, జైలు అధికారులతోపాటు పలువురు ఆమె చాలా మంచి ప్రవర్తనగల మహిళ అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అంబర్ హిల్బర్లింగ్ 2011లో తన భర్త జోష్ హిల్బర్లింగ్ను తాము ఉంటున్న తుల్సా అపార్ట్మెంట్లో 25 వ అంతస్తులోని గది కిటికీలో నుంచి తోసేయడంతో అతడు చనిపోయాడు. దీంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అయితే, గత ఏడాది జైలులో ఆమెను ఇంటర్వ్యూ చేయగా ఆ రోజు తన భర్త జోష్ తనను తీవ్రంగా కొట్టాడని, కిందపడేసి ఈడ్చానని, ఆ సమయంలో తాను గర్భవతిని అని, ఆ విషయం కూడా లెక్కచేయకుండా తనపై దాడి చేశాడని చెప్పింది. తనను తాను రక్షించుకునే క్రమంలో తోసివేయగా కిటికీలో నుంచి పడి చనిపోయాడని తెలిపింది. కానీ, అలా జరగకుండా ఉండాల్సిందని కూడా అభిప్రాయపడింది. జైలులో మంచి ప్రవర్తనతోనే ఉంటున్న అంబర్ అనూహ్యంగా సోమవారం తాను ఉంటున్న ఓక్లాహామాలోని మాబెల్ బాసెట్ కరెక్షనల్ సెంటర్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె చనిపోవడానికి గల కారణాలను మాత్రం దర్యాప్తు అధికారులు అన్వేషిస్తున్నారు.