
తలలో బుల్లెట్.. 95 ఏళ్లు!
కాలిఫోర్నియాకు చెందిన విలియం లాలిస్ పేస్ దగ్గర మాత్రం తుస్సుమంటుంది.
కాలిఫోర్నియా: ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా..’’ అంటాడు పండుగాడు. బుల్లెట్‌లాంటి ఈ డైలాగ్ ఎవరిదగ్గరైనా పేలుతుందేమో.. కాలిఫోర్నియాకు చెందిన విలియం లాలిస్ పేస్ దగ్గర మాత్రం తుస్సుమంటుంది. అవును మరి.. ఏకంగా బుల్లెట్‌ని 95 ఏళ్లపాటు తలలో దాచుకున్నవాడి దగ్గరా బీరాలు..! నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే 1917 అక్టోబర్‌లో ఏం జరిగిందో మీకు తెలియాల్సిందే..! ఎప్పట్లాగే ఆ రోజు కూడా విలియం తన అన్నతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు. మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుందాం అన్నాడు విలియం అన్న. దానికి ఓకే చెప్పాడు విలియం. అంతే క్షణాల్లో ‘‘ .22 రైఫిల్’’తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు. దాన్ని అటూ ఇటూ తిప్పుతూ సినిమా హీరోలా పోజు కొట్టాడు. రైఫిల్‌ను పట్టుకుని రకరకాల భంగిమలు ప్రయత్నించాడు.
ఈ ప్రయత్నంలో భాగంగా దురదృష్టవశాత్తూ ఆ రైఫిల్ పెద్ద శబ్దం చేస్తూ పేలింది. గట్టిగా చెవులు మూసుకున్నారు అన్నదమ్ములిద్దరూ. అయితే కొద్దిసేపటికి విలియం చెవి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అంతే.. స్పృహ కోల్పోయాడు. కళ్లు తెరచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అన్న పేల్చిన బుల్లెట్ విలియం తలలోకి దూసుకుపోయిందని చెప్పారు డాక్టర్లు. దాన్ని తీయడానికి వారెవరూ సాహసించలేదు. బుల్లెట్‌ని తొలగిస్తే విలియం ప్రాణాలతో ఉంటాడనే నమ్మకం తమకు లేదని చేతులెత్తేశారు. చేసేదేం లేక బుల్లెట్‌ని తలలోనే ఉంచుకుని కాలం వెళ్లదీశాడు విలియం లాలిస్ పేస్. అయితే దీని ప్రభావం నెమ్మది నెమ్మదిగా అతని దృష్టి, వినికిడి శక్తిపై పడింది. కుడి కన్ను, చెవి పనిచేయడం మానేశాయి. అలా 95 ఏళ్లపాటు బతికిన విలియం 2012లో 103 ఏళ్లకు కాలం చేశాడు. ఇతని గొప్పదనాన్ని గుర్తించిన గిన్నిస్ వారు 2006లో రికార్డు పుస్తకాల్లో చోటు కల్పించారు.