సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు తరలి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లిలోని మేడారంలో జనవరి 31 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. జాతర సమయంలో కోటి మంది భక్తులు మేడారానికి వస్తారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో జనం వస్తుండటంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందులతో అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతుంటారు.
వీరికి సత్వర వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని జాతర సమయంలో అక్కడికి పంపించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే 220 మంది వైద్యులు, 780 మంది పారా మెడికల్ సిబ్బంది జాతర సమయంలో అక్కడ విధులు నిర్వహించేలా కసరత్తు పూర్తి చేసింది. వరంగల్ ఎంజీఎం, జీఎంహెచ్, సీకేఎం, ప్రాంతీయ కంటి ఆస్పత్రులకు చెందిన 20 మంది వైద్య నిపుణులు మేడారంలో సేవలందిస్తారు. జనరల్ ఫిజీషియన్, సాధారణ శస్త్రచికిత్స నిపుణులు, స్త్రీలు, చెవి, ముక్కు, గొంతు, రేడియాలజిస్ట్, దంత, పిల్లల, కంటి, ఎముకల వైద్య నిపుణులు షిప్టుల వారీగా 24 గంటలు సేవలందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల నుంచి వైద్యులు, సిబ్బంది మేడారానికి వస్తారు.
50 పడకల తాత్కాలిక ఆస్పత్రి..
భారీగా వచ్చే భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు జాతర ప్రాంతంలోనే 50 పడకల సామర్థ్యంతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. మేడారం పరిసర ప్రాంతాలు, జాతరకు వచ్చే మార్గాల్లో సుమారు 70 కిలోమీటర్ల నుంచి ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు భక్తులకు కల్పించనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు విరేచనాలు, జ్వరం, జలుబు, తలనొప్పి, ఇతర అత్యవసర సేవలు అవసరమైన రోగాలకు మందులను ఇస్తారు. వైద్య పరికరాలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆక్సిజన్ లాంటి సౌకర్యాలను అందుబాటులో పెడతారు. వేగంగా వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 14 చోట్ల ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రహదారుల వెంట మరో 40 శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. 108 వాహనాలు 13, ఆర్‌బీఎస్‌కే వాహనాలు 5, 104 వాహనాలు 5, మొత్తం 26 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నారు.
వన జాతరలో సత్వర వైద్యం
Published Thu, Jan 11 2018 3:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment