అమ్మ కడుపు చల్లగా..
- ఏపీ, తెలంగాణలో త్వరలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్
- కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త పథకం
- ప్రతి గర్భిణికి నెలనెలా ఉచితంగా వైద్య పరీక్షలు
- ఏటా 3 కోట్ల మందికి ప్రయోజనం
- మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణ, ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్(పీఎంఎస్‌ఎంఏ)కు శ్రీకారం చుట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఏటా 3 కోట్ల మంది గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రతి గర్భిణికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకుని తల్లికి మందులివ్వడం ఈ నూతన పథకం ఉద్దేశం. పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్ త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లోకి రానుంది.
ఉచితంగా పరీక్షలు, మందులు, భోజనం
ప్రస్తుతం గర్భిణులకు ప్రతినెలా పరీక్షలు (యాంటీనేటల్ చెకప్స్) సక్రమంగా నిర్వహించడం లేదు. దీనివల్ల మాతా శిశు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి 1,000 మంది శిశువుల జననాల్లో తెలంగాణలో 28 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 35 మంది మృతి చెందుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఇకపై వీటి సంఖ్యను పూర్తిగా తగ్గించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే పీఎంఎస్‌ఎంఏను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో చేపట్టే ఈ పథకం కింద ప్రతి గర్భిణికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఉచితంగా మందులు, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రధానంగా ఇన్‌స్టిట్యూషన్ డెలివరీస్ (ఆస్పత్రిలో ప్రసవాలు) నూటికి నూరు శాతం జరిగేలా చర్యలు తీసుకుంటారు. 2007-08లో ఆస్పత్రిలో ప్రసవాలు 47 శాతమే జరిగాయి. కేంద్రం అమలు చేసిన పథకాలతో వీటి సంఖ్య 2013-14 నాటికి 78.7 శాతానికి చేరింది.
ప్రతినెలా 9వ తేదీన పరీక్షలు
దేశవ్యాప్తంగా ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తల్లి 9 నెలలు బిడ్డను గర్భంలో మోస్తుంది కాబట్టి 9వ తేదీని ఎంచుకున్నారు. ఆరోజు ప్రతి గర్భిణి వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 9వ తేదీ సెలవు రోజు అయినా సరే సంబంధిత అధికారులు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగంలో ఆరోగ్య నిపుణుల కొరత ఉంటే ప్రైవేట్ వైద్యులను నియమించుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్‌ను విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, పథకం అమలు కోసం రాష్ర్ట ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించుకోవాలని కేంద్రం వెల్లడించింది.